ఐపీఎల్ 2025 సీజన్‍లో పదో ఓటమిని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‍కే) మూటగట్టుకుంది. ఇప్పటికే ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయిన ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై మరోసారి నిరాశపరిచింది. ఢిల్లీ వేదికగా నేడు (మే 20) జరిగిన మ్యాచ్‍లో చెన్నైపై 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ అలవోకగా గెలిచింది. 17 బంతులు మిగిల్చి 17.1 ఓవర్లలోనే విజయం సాధించింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ యంగ్ బ్యాటర్, 14ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57 రన్స్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఆటతో హాఫ్ సెంచరీ చేసి రెచ్చిపోయాడు. చెన్నై బౌలర్లను బాదేశాడు. ప్లేఆఫ్స్ పోటీ నుంచి ఇప్పటికే వైదొలిగిన రాజస్థాన్ గెలుపుతో ఈ సీజన్‍లో తన పోరును ముగించింది. ఈ మ్యాచ్ ఎలా సాగిందంటే..
ఈ మ్యాచ్‍లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది చెన్నై సూపర్ కింగ్స్. 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. 17 ఏళ్ల యంగ్ ఓపెనర్ ఆయుష్ మాత్రే 20 బంతుల్లోనే 43 పరుగులతో దుమ్మురేపాడు. 8 ఫోర్లు, ఓ సిక్స్ బాది దూకుడుగా ఆడాడు. ఆరంభం నుంచి మాత్రే తన మార్క్ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే, మరో ఓపెనర్ డెవోన్ కాన్వే (10) రెండో ఓవర్లో ఔటయ్యాడు. రాజస్థాన్ బౌలర్ యుధ్‍వీర్ సింగ్ అతడిని ఔట్ చేశాడు. మరో యంగ్ ప్లేయర్ ఉర్విల్ పటేల్ (0) అదే ఓవర్లో పెవిలియన్ చేరాడు.
మరోవైపు ఆయుష్ దూకుడుగా ఆడాడు. మంచి షాట్లతో బౌండరీలు బాదాడు. దీంతో ఐదో ఓవర్లోనే 50 పరుగుల మార్క్ దాటింది చెన్నై. అయితే, ఆరో ఓవర్లో మాత్రేను రాజస్థాన్ పేసర్ తుషార్ దేశ్‍పాండే ఔట్ చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ (13) కాసేపే నిలువగా.. రవీంద్ర జడేజా (1) ఫెయిల్ అయ్యాడు.
ఓవైపు వికెట్లు పడినా డెవాల్డ్ బ్రెవిస్ మాత్రం దూకుడుగా ఆడాడు. 25 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. దీంతో చెన్నై స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కానీ 14వ ఓవర్లో చెన్నై 137 పరుగుల వద్ద ఉన్నప్పుడు బ్రెవిస్ ఔటవటంతో స్టోరీ మారిపోయింది.
బ్రెవిస్ ఔటయ్యాక చెన్నై స్కోరు బోర్డు మందగించింది. శివమ్ దూబే 32 బంతుల్లో కేవలం 39 పరుగులే చేయగలిగాడు. చివరి ఓవర్లో హిట్టింగ్ చేయలేక తంటాలు పడ్డాడు. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా 17 బంతుల్లో 16 పరుగులే చేయగలిగాడు. ఇద్దరూ వేగంగా ఆడలేకపోయారు. చివరి ఓవర్లో ఔటయ్యారు. చివరి మూడు ఓవర్లలో కేవలం చెన్నై 17 పరుగులే చేయగలిగింది. దీంతో 187 పరుగులే చేసింది. బ్రెవిస్ ఆడుతున్నప్పుడు ఓ దశలో 220 వస్తుందేమో అనిపించగా.. చివర్లో ఆ జట్టు తడబడింది.
రాజస్థాన్ బౌలర్లలో యుధ్‍వీర్ సింగ్, ఆకాశ్ మధ్వల్ తలా మూడు వికెట్లతో రాణించారు. తుషార్ దేశ్‍పాండే, వణిందు హసరంగ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
188 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదిరే ఆరంభం ఇచ్చాడు. 19 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. మరో ఎండ్‍లో వైభవ్ సూర్యవంశీ ఉన్నా.. ఆరంభంలో ఎక్కువ స్ట్రైక్ జైస్వాల్ తీసుకున్నాడు. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో యశస్వి రెచ్చిపోయాడు. అయితే, నాలుగో ఓవర్లో చెన్నై బౌలర్ అన్షుల్ కాంబోజ్.. యశస్విని ఔట్ చేసి బ్రేక్‍త్రూ ఇచ్చాడు.
జైస్వాల్ ఔటయ్యాక వైభవ్ సూర్యవంశీ ధనాధన్ హిట్టింగ్‍తో రెచ్చిపోయాడు. చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొని బాదేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (31 బంతుల్లో 41 పరుగులు; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతడికి తోడుగా నిలిచాడు. వైభవ్, సంజూ దూకుడుతో 10.3 ఓవర్లలో 100 పరుగులు దాటింది రాజస్థాన్. జోరు కొనసాగించిన వైభవ్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరాడు. ఇప్పటికే ఈ సీజన్‍లో శతకం చేసిన ఈ 14 ఏళ్ల యంగ్‍స్టర్.. ఇప్పుడు హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
నిలకడగా ఆడుతున్న సంజూ శాంసన్‍ను 14వ ఓవర్లో ఔట్ చేశాడు చెన్నై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. అదే ఓవర్ చివరి బంతికి భారీ షాట్‍కు ప్రయత్నించి పెవిలియన్‍కు చేరాడు వైభవ్. 33 బంతుల్లో 57 పరుగుల (4 పోర్లు, 4 సిక్స్‌లు) వద్ద ఔటయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి చెన్నైను గేమ్‍లోకి తెచ్చాడు అశ్విన్. 138 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది రాజస్థాన్.
ఆ తర్వాత రాజస్థాన్ బ్యాటర్ ధృవ్ జురెల్ 12 బంతుల్లోనే అజేయంగా 31 పరుగులు బాదాడు. 2 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. హిట్టింగ్ మెరుపులు మెరిపించాడు. షిమ్రన్ హిట్మైర్ 5 బంతుల్లో 12 పరుగులతో నాటౌట్‍గా నిలిచాడు. జురెల్, హిట్మైర్ మెరుపులతో గెలుపు తీరాన్ని వేగంగా దాటింది రాజస్థాన్. 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి విజయం సాధించింది. 17 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. చెన్నై బౌలర్లలో అశ్విన్ రెండు, కాంబోజ్, దేశ్‍పాండే తలా ఓ వికెట్ తీసుకున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ పోరు ముగిసింది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్ అయింది. 14 మ్యాచ్‍ల్లో 10 మ్యాచ్‍ల్లో ఓడిన ఆ జట్టు.. నాలుగే గెలిచి 8 పాయింట్లు దక్కించుకుంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో ప్లేస్‍లో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్‍ల్లో 10 ఓడి.. మూడు గెలిచింది. ధోనీ సారథ్యంలోని ఆ జట్టుకు మరో గ్రూప్ మ్యాచ్ మిగిలి ఉంది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో ప్రస్తుతం నిలిచింది.
సంబంధిత కథనం