IPL 2025 RCB vs CSK: అదరగొట్టిన నూర్, పతిరన.. రజత్ ఫైటింగ్ ఇన్నింగ్స్.. ఆర్సీబీ స్కోరు ఎంతంటే?
IPL 2025 RCB vs CSK: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ అదరగొట్టాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. శుక్రవారం చెపాక్ పిచ్ పై పోరాడాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులతో ఆ టీమ్ భారీ స్కోరు సాధించింది.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ (32 బంతుల్లో 51) సత్తాచాటాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. 4 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. శుక్రవారం (మార్చి 28) చెపాక్ లో జరుగుతున్న మ్యాచ్ లో ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని హాఫ్ సెంచరీతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఆఖర్లో టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) భారీ షాట్లు కొట్టాడు. చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ (3/36) మరోసారి రాణించాడు. పతిరన 2 వికెట్లు తీశాడు.
ఆరంభం అదిరినా
ఐపీఎల్ 2025లో సీఎస్కేతో మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ ఆరంభం అదిరింది. డేంజరస్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32) మరోసారి చెలరేగాడు. 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ కోహ్లి మాత్రం పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆడిన తొలి 10 బంతుల్లో 4 పరుగులే చేశాడు.
ధోని మెరుపు స్టంపింగ్
ముంబయితో మ్యాచ్ లో చెపాక్ పిచ్ పై చెలరేగిన స్పిన్నర్ నూర్ అహ్మద్ మరోసారి మాయ చేశాడు. వస్తూనే ఫిల్ సాల్ట్ వికెట్ పడగొట్టాడు. వయసు పెరుగుతున్నా గ్రౌండ్ లో అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ప్రదర్శిస్తున్న ధోని మరోసారి అదరగొట్టాడు. ముంబయితో మ్యాచ్ లో సూర్యను మెరుపు స్టంపింగ్ చేసిన మహి.. ఈ మ్యాచ్ లో సాల్ట్ ను అదే వేగంతో స్టంపింగ్ చేశాడు.
కోహ్లి స్ట్రగుల్
సాల్ట్ వికెట్ తో క్రీజులోకి వచ్చిన దేవ్ దత్ పడిక్కల్ (14 బంతుల్లో 27) మెరుపు షాట్లు ఆడాడు. జడేజా బౌలింగ్ లో దేవ్ దత్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. కానీ మరో ఎండ్ లో కోహ్లి స్ట్రగుల్ మాత్రం కొనసాగింది. పడిక్కల్ ను అశ్విన్ బుట్టలో వేసుకున్నాడు. పతిరన బౌలింగ్ లో వరుసగా సిక్సర్, ఫోర్ తో కాస్త జోరు అందుకుంటున్న సమయంలో కోహ్లీని నూర్ ఔట్ చేశాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్
13 ఓవర్లకు ఆర్సీబీ 119/3తో నిలిచింది. అప్పటికే బాదుడు మొదలెట్టిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఆ తర్వాత మరింత దూకుడు పెంచాడు. జడేజా ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. ఆఖర్లో ఆర్సీబీ ఇన్నింగ్స్ రాకెట్ వేగాన్ని అందుకుంది. 30 బాల్స్ లో రజత్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. లివింగ్ స్టన్ (10), జితేశ్ శర్మ (12) నిలబడకపోయినా.. రజత్ పోరాటం కొనసాగించాడు.
హ్యాట్రిక్ సిక్సర్లు
కానీ గాయం నుంచి కోలుకుని వచ్చిన పతిరన 19వ ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చి రజత్ తో పాటు కృనాల్ పాండ్య (0)నూ పెవిలియన్ చేర్చాడు. ఆర్సీబీ స్కోరు 180 దాటడమూ అనుమానంగానే కనిపించింది. కానీ చివరి ఓవర్లో టిమ్ డేవిడ్ చెలరేగాడు. సామ్ కరన్ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లతో టీమ్ ను 200కు చేరువ చేశాడు. డేవిడ్ 8 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఓ ఫోర్ తో 22 నాటౌట్ గా నిలిచాడు.
సంబంధిత కథనం