ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్ లో ఓడిపోయే సెంటిమెంట్ ను ముంబయి ఇండియన్స్ కొనసాగించింది. ఆదివారం (మార్చి 23) ఆ టీమ్ 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది. మొదట ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్. నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు.
ఛేదనలో సీఎస్కే 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. రచిన్ రవీంద్ర (65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్ (53) సత్తాచాటారు. ముంబయి యంగ్ స్పిన్నర్ విఘ్నేశ్ 3 వికెట్లు పడగొట్టాడు.
ముంబయి ఇండియన్స్ పై ఛేజింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. చెపాక్ పిచ్ పై 203కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. రాహుల్ త్రిపాఠి (2) త్వరగానే ఔటైనా.. రచిన్ రవీంద్ర తో కలిసి రుతురాజ్ జట్టును టార్గెట్ దిశగా నడిపించాడు. 26 బంతులాడిన అతను 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. 7.4 ఓవర్లలో 78/1తో సీఎస్కే ఘన విజయం ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాతే ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిన ముంబయి ఇండియన్స్ యువ మణికట్టు స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ చెన్నైని దెబ్బకొట్టాడు. తన వరుస ఓవర్లలో ఈ కేరళ స్పిన్నర్.. రుతురాజ్, శివమ్ దూబె (9), దీపక్ హుడా (3)ను ఔట్ చేయడంతో ఛేజింగ్ రసవత్తరంగా మారింది. సామ్ కరన్ (4)ను విల్ జాక్స్ బౌల్డ్ చేయడంతో సీఎస్కే 116/5తో నిలిచింది.
సీఎస్కే విజయానికి 24 బంతుల్లో 31 పరుగులు కావాల్సి రావడంతో ఉత్కంఠ రేగింది. కానీ ఇద్దరు రవీంద్రలు ఎలాంటి టెన్షన్ పడకుండా మ్యాచ్ ముగించారు. బౌల్ట్ బౌలింగ్ లో రవీంద్ర జడేజా ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత ప్రమాదకరంగా మారిన విఘ్నేశ్ బౌలింగ్ లో రచిన్ రవీంద్ర రెండు సిక్సర్లు కొట్టడంతో సీఎస్కే పని సులువైంది.
కానీ వికెట్ కోసం సీఎస్కే ఫ్యాన్స్ ఎదురు చూశారు. ధోని బ్యాటింగ్ చూడాలన్నదే కారణం. చివరకు సీఎస్కే 4 పరుగులు చేయాల్సి ఉండగా జడేజా రనౌటయ్యాడు. అంతే ఒక్కసారిగా ధోని నామజపంతో చెపాక్ హోరెత్తింది. కానీ ధోని తొలి రెండు బాల్స్ లో రన్ తీయలేకపోయాడు. లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ కే రచిన్ సిక్సర్ తో మ్యాచ్ ముగించాడు.
ఐపీఎల్ 2025లో సీఎస్కేతో మ్యాచ్ ను ముంబయి ఇండియన్స్ చప్పగా మొదలెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆ టీమ్ ఇన్నింగ్స్ లో పెద్దగా మెరుపుల్లేవు. పేసర్ ఖలీల్ అహ్మద్ తన వరుస ఓవర్లలో రోహిత్ (0), రికిల్టన్ (13)ను ఔట్ చేయడంతో ఆరంభంలోనే ముంబయికి షాక్ తగిలింది.
36/3తో కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ సూర్య కుమార్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆదుకునేందుకు ప్రయత్నించారు. కానీ వేగంగా ఆడలేకపోయారు. సూర్య 26 బంతుల్లో 29 పరుగులు చేయగా.. తిలక్ 25 బంతుల్లో 31 పరుగులే సాధించాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో సీఏస్కేకు ఆడుతున్న అఫ్గాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ మిడిల్ ఓవర్లలో ముంబయిని దెబ్బ కొట్టాడు. ధోని మెరుపు స్టంపింగ్ తో సూర్యకుమార్ ను ఔట్ చేశాడు. తన నెక్ట్స్ ఓవర్లో రాబిన్ మింజ్ (3)తో పాటు తిలక్ వర్మ నూ పెవిలియన్ చేర్చాడు. తన తర్వాతి ఓవర్లో నమన్ ధీర్ (17) వికెట్ నూ దక్కించుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ చివర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) అదరగొట్టడంతో ముంబయి స్కోరు 150 దాటింది.