ఆదివారం (మార్చి 23) మధ్యాహ్నం మ్యాచ్ లో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది. కానీ సాయంత్రం చెన్నైలో మాత్రం ఇందుకు పూర్తి డిఫరెంట్ పరిస్థితి కనిపించింది. చెపాక్ లో సీఎస్కే బౌలర్లకు దాసోహమైన ముంబయి ఇండియన్స్ కష్టంగా పరుగులు సాధించింది. ఆ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. స్పిన్నర్ నూర్ అహ్మద్ 4 వికెట్లతో ఆ టీమ్ ను చావుదెబ్బ కొట్టాడు. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2025లో సీఎస్కేతో మ్యాచ్ ను ముంబయి ఇండియన్స్ చప్పగా మొదలెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆ టీమ్ ఇన్నింగ్స్ లో అసలు మెరుపులే లేవు. స్పిన్ ను అనుకూలించే చెపాక్ పిచ్ పై ముంబయి బ్యాటర్లు స్పిన్ కు దాసోహమయ్యారు.
మొదట పేసర్ ఖలీల్ అహ్మద్ తన వరుస ఓవర్లలో రోహిత్ (0), రికిల్టన్ (13)ను ఔట్ చేయడంతో ఆరంభంలోనే ముంబయికి షాక్ తగిలింది. 9 ఏళ్ల తర్వాత తిరిగి చెన్నైకి ఆడుతున్న సీనియర్ స్పిన్నర్ అశ్విన్ విల్ జాక్స్ (11)ను బుట్టలో వేసుకున్నాడు.
36/3తో కష్టాల్లో పడ్డ జట్టును ఆదుకునేందుకు ఈ మ్యాచ్ లో ముంబయి కెప్టెన్ సూర్య కుమార్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ప్రయత్నించారు. వికెట్ల పతనాన్ని అడ్డుకున్న ఈ జంట పరుగులు సాధించింది. కానీ వేగంగా ఆడలేకపోయింది. సూర్య 26 బంతుల్లో 29 పరుగులు చేయగా.. తిలక్ 25 బంతుల్లో 31 పరుగులే సాధించాడు. 87/3తో సీఎస్కే నెమ్మదిగా కోలుకునేలా కనిపించింది.
ఈ ఐపీఎల్ సీజన్లో సీఏస్కేకు ఆడుతున్న అఫ్గాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ మిడిల్ ఓవర్లలో ముంబయిని దెబ్బ కొట్టాడు. ధోని మెరుపు స్టంపింగ్ తో సూర్యకుమార్ ను ఔట్ చేశాడు. తన నెక్ట్స్ ఓవర్లో రాబిన్ మింజ్ (3)తో పాటు తిలక్ వర్మ నూ పెవిలియన్ చేర్చాడు.
నూర్ దెబ్బకు ముంబయి మళ్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. గూగ్లీలు, లెగ్ స్పిన్ తో నూర్ మాయ చేశాడు. తన తర్వాతి ఓవర్లో నమన్ ధీర్ (17) వికెట్ నూ దక్కించుకున్నాడు.
ఇన్నింగ్స్ చివర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) మెరుపులతో ముంబయి స్కోరు 150 దాటింది. గత సీజన్లో సీఎస్కేకు ఆడిన దీపక్.. ఈ సారి ముంబయి తరపున ఆడుతూ చెన్నైపైనే బ్యాటింగ్ లో సత్తాచాటాడు. ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో చాహర్ వరుసగా 4, 6 కొట్టాడు. చివరి ఓవర్లో మరో సిక్సర్, ఫోర్ తో ముంబయి ఇండియన్స్ కు పోరాడే స్కోరు అందించాడు.
సంబంధిత కథనం