చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య వార్ మరోసారి కొనసాగబోతోంది. ఈ రెండు టీమ్స్ మధ్య కిక్కిచ్చే పోటీకి ఐపీఎల్ 2025 సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ రెండు ఫ్రాంఛైజీలు ఒకదాన్ని మరొకటి ట్రోల్స్ చేసుకుంటున్నాయి. ఇక ఫ్యాన్స్ వార్ ఇప్పటికే ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్.. ఆర్సీబీని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేసిన మీమ్ వైరల్ అవుతోంది.
సీఎస్కే మాజీ ప్లేయర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన మీమ్ వైరల్ గా మారుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తూ బద్రీనాథ్.. మిగతా ఫ్రాంఛైజీలను రిప్రజెంట్ చేస్తున్న వాళ్లతో షేక్ హ్యాండ్ చేస్తాడు. హగ్ చేసుకుంటాడు. కానీ ఆర్సీబీ టీమ్ వచ్చే సరికి మాత్రం అసలు పట్టించుకోకుండా పోతాడు. అసలు అది ఐపీఎల్ జట్టు కాదనే అర్థం వచ్చేలా బద్రీనాథ్ ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి. ఇప్పుడీ మీమ్ వైరల్ అవుతోంది. ‘ఐపీఎల్ 2025కు ముందు చెన్నై మైండ్ వాయిస్’ అని ఈ వీడియోకు బద్రీనాథ్ క్యాప్షన్ యాడ్ చేశాడు.
ఐపీఎల్ 2025 లీగ్ దశలో ఆర్సీబీ, సీఎస్కే రెండు సార్లు తలపడతాయి. మార్చి 28న ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. ఆ తర్వాత మే 3న బెంగళూరులో మరోసారి తలపడతాయి. ఈ రెండు సౌత్ టీమ్స్ మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఐపీఎల్ 2024లో ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచి ప్లేఆఫ్స్ చేరింది. సీఎస్కే ఇంటి ముఖం పట్టింది. ఆ విజయం తర్వాత ఆర్సీబీ సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో సాగాయి.
ఐపీఎల్ హిస్టరీలోనే సీఎస్కే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఆ టీమ్ అయిదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. 2011లో ఆర్సీబీని ఓడించి వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన తొలి టీమ్ గా చెన్నై నిలిచింది. మరోవైపు ఆర్సీబీ ఇప్పటివరకూ ఒక్క టైటిలూ గెలుచుకోలేకపోయింది. 17 సీజన్లలోనూ ఆ టీమ్ కు నిరాశ తప్పలేదు. మూడు సార్లు ఫైనల్ చేరినా రన్నరప్ గానే నిలిచింది.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ కొత్త కెప్టెన్ నాయకత్వంలో బరిలో దిగుతోంది. రజత్ పాటీదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ టైటిల్ పై ఆశలు పెట్టుకుంది. మరోవైపు గత సీజన్ కు ముందే ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే సారథిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం