ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. వరుసగా రెండు విజయాలతో దూకుడు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్రేక్ వేసింది. అది కూడా ఆర్సీబీ హోం గ్రౌండ్ లో కావడం గమనార్హం. బుధవారం (ఏప్రిల్ 2) చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో జీటీ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఛేజింగ్ లో ఆ టీమ్ 2 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. బట్లర్ (39 బాల్స్ లో 73 నాటౌట్) అదరగొట్టాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. సాయి కిశోర్ 2 వికెట్లు తీశాడు. లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 54) పోరాడాడు. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇదే తొలి ఓటమి. జీటీకి రెండో విక్టరీ.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీపై ఛేదనలో సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49) చెలరేగిపోయాడు. కెప్టెన్ శుభ్ మన్ (14) త్వరగానే ఔటైనా.. బట్లర్ తో కలిసి సుదర్శన్ టీమ్ ను నడిపించాడు. సూపర్ ఫామ్ లో సుదర్శన్, బట్లర్ గుజరాత్ ను విజయం దిశగా తీసుకెళ్లారు. హేజిల్ వుడ్ బౌలింగ్ లో క్రీజుకు అడ్డంగా జరిగి కీపర్ తలమీదుగా సుదర్శన్ కళ్లుచెదిరే సిక్సర్ కొట్టాడు.
మరోవైపు నెమ్మదిగా బ్యాటింగ్ ఆరంభించిన బట్లర్ క్రమంగా దూకుడు అందుకున్నాడు. ఫస్ట్ 10 బాల్స్ లో 9 రన్స్ మాత్రమే చేసిన అతను.. రసిఖ్ ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ తో టాప్ గేర్ లోకి వెళ్లిపోయాడు. హ్యాట్రిక్ ఆఫ్ సెంచరీకి సుదర్శన్ ఒక్క రన్ దూరంలో ఆగిపోయాడు. హేజిల్ వుడ్ అతణ్ని ఔట్ చేశాడు. వికెట్ పడ్డా బట్లర్ ఆగలేదు. లివింగ్ స్టోన్ బౌలింగ్ లో వరుసగా 4, 6 తో ఫిప్టీ కంప్లీట్ చేసుకున్నాడు.
సూపర్ బ్యాటింగ్ తో గుజరాత్ టైటాన్స్ ను గెలిపించిన బట్లర్.. హేజిల్ వుడ్ వేసిన 18వ ఓవర్లో కొట్టిన ఓ సిక్సర్ వావ్ అనిపించింది. రివర్స్ ర్యాంప్ తో కీపర్ తలమీదుగా అతను కొట్టిన సిక్సర్ కు శుభ్ మన్ సహా స్టేడియంలోని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే మరో భారీ సిక్సర్ బాదాడు. అదే ఓవర్లో రూథర్ ఫర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్) సిక్సర్ తో మ్యాచ్ ముగించాడు. బట్లర్ 5 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు.
రబాడ ప్లేస్ లో మ్యాచ్ ఆడుతున్న అర్షద్ ఖాన్ తన తొలి ఓవర్లోనే కింగ్ కోహ్లి (7) వికెట్ తీసి చిన్నస్వామి స్టేడియాన్ని సైలెంట్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరపున అలవాటైన పిచ్ పై సిరాజ్ చెలరేగాడు. తన వరుస ఓవర్లలో దేవ్ దత్ పడిక్కల్ (4), సాల్ట్ (14) స్టంప్స్ ను లేపేశాడు. ఇషాంత్ శర్మ కెప్టెన్ రజత్ పటీదార్ (12)ను ఎల్బీగా ఔట్ చేయడంతో ఆర్సీబీ 42/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
జితేశ్ శర్మ (21 బంతుల్లో 33), లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 54) జోడీ ఆర్సీబీని ఆదుకునే ప్రయత్నం చేసింది. కానీ స్పిన్నర్ సాయి కిశోర్ తన తర్వాతి ఓవర్లో జితేశ్ ను ఔట్ చేసి ఆర్సీబీకి మళ్లీ బ్రేక్ వేశాడు.లివింగ్ స్టన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డేంజరస్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు.
సిరాజ్.. లివింగ్ స్టన్ ను ఔట్ చేసి ఆర్సీబీ భారీ స్కోరు ఆశలు కూల్చాడు. 5 సిక్సర్లు బాదిన లివింగ్ స్టన్ ఓ ఫోర్ కొట్టాడు. లాస్ట్ ఓవర్లో టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32) చెలరేగిపోయాడు. ప్రసిద్ధ్ బౌలింగ్ లో వరుసగా 4, 6, 4 కొట్టిన డేవిడ్ చివరి బంతికి ఔటయ్యాడు.
సంబంధిత కథనం