ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభానికి ముందే ముంబయి ఇండియన్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ టీమ్ స్టార్ పేసర్ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడం ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. సీజన్ లో అడుగుపెట్టకముందే ముంబయికి షాక్ తగిలింది. అయితే తాజాగా బుమ్రా ఇంజూరీపై ముంబయి ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే అప్ డేట్ ఇచ్చాడు. బుధవారం (మార్చి 19) నిర్వహించిన ప్రెస్ మీట్ లో జయవర్ధనే ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
ఎన్సీఏలో బుమ్రా గాయం నుంచి కోలుకుంటున్నాడని, కానీ అతని ఫిట్ నెస్ పై ఫీడ్ బ్యాక్ గురించి వేచి చూడాల్సిందేనని మహేల జయవర్ధనే పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తరపున బుమ్రా ఎప్పుడు ఆడతాడనే విషయంపై జయవర్ధనే కూడా క్లారిటీ ఇవ్వలేకపోయాడు.
"అతను (బుమ్రా) ఇప్పుడే కోలుకుంటున్నాడు. వారి (బీసీసీఐ మెడికల్ టీమ్) నుంచి అతని గురించి వచ్చే ఫీడ్‌బ్యాక్ కోసం మనం వేచి చూడాలి" అని జయవర్ధనే అన్నాడు. "ప్రస్తుతానికి అంతా బాగుంది. కానీ ఇది డే టూ డే పరంగా ఉంటుంది. బుమ్రా మంచి మానసిక స్థితిలో ఉన్నాడు. కానీ అతను జట్టులో లేకపోవడం మాకు ఛాలెంజ్.ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో అతనొకడు. కొన్నేళ్లుగా మాకు అద్భుతమైన పేసర్’’ అని జయవర్ధనే తెలిపాడు.
బుమ్రా ఐపీఎల్ 2025లో కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యే పరిస్థితి ఉండటంతో ఆ ఛాన్స్ ఎవరు ఉపయోగించుకుంటారో చూడాలని జయవర్ధనే చెప్పాడు. ‘‘మేం అతని (బుమ్రా) కోసం వెయిట్ చేయాలి. లేదా ఇతర బౌలర్ ఎవరైనా ఈ ఛాన్స్ ను ఊపయోగించుకుంటారేమో చూడాలి. ఈ విషయాన్ని ఇలాగే చూస్తున్నాం. దీని వల్ల కొన్ని విషయాలు ప్రయత్నించేందుకు మాకు ఛాన్స్ దొరికింది. సీజన్ ఆరంభంలో కొన్ని మార్పులు తప్పవు’’ అని జయవర్ధనే స్పష్టం చేశాడు.
జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దీని నుంచి అతను ఇంకా కోలుకోలేదు. వెన్ను నొప్పి కారణంగా అతను దుబాయ్‌లో జరిగిన భారత ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మిస్ అయ్యాడు. ఏప్రిల్ ప్రారంభంలో ముంబయి ఇండియన్స్ జట్టులో బుమ్రా చేరే అవకాశముందని క్రిక్ఇన్ఫో పేర్కొంది.
ముంబయికి ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, రీస్ టోప్లీ, కార్బిన్ బోష్ (లిజాడ్ విలియమ్స్ స్థానంలో) తో కూడిన పేస్ విభాగం సిద్ధంగా ఉంది. వారికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఆల్‌రౌండర్, అన్‌క్యాప్డ్ అశ్విని కుమార్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, రాజ్ అంగాద్ బావా కూడా ఉన్నారు. అయితే.. చాహర్, బౌల్ట్ ఇద్దరూ పవర్‌ప్లే స్పెషలిస్టులు కాబట్టి,డెత్ ఓవర్లలో టీమ్ బుమ్రాను మిస్ అయ్యే ఛాన్స్ ఉంది.
సంబంధిత కథనం