Harry Brook IPL Ban: 6.25 కోట్ల ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ కు బీసీసీఐ షాక్.. ఐపీఎల్ ఆడకుండా రెండేళ్ల బ్యాన్.. రీజన్ ఇదే
Harry Brook IPL Ban: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కు బీసీసీఐ దిమ్మతిరిగే షాకిచ్చింది. రెండేళ్ల పాటు ఐపీఎల్ లో ఆడకుండా బ్యాన్ విధించింది. మరి బీసీసీఐ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది.

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. రూల్స్ ను బ్రేక్ చేసినందుకు షాక్ ఇచ్చింది. రెండేళ్ల పాటు ఐపీఎల్ లో ఆడకుండా బ్రూక్ ను బ్యాన్ చేయడం కలకలం రేపుతోంది. ఇలా ఐపీఎల్ లో రెండేళ్ల నిషేధం ఎదుర్కోనున్న తొలి క్రికెటర్ బ్రూక్. బ్రూక్ పై బీసీసీఐ వేటు వేయడం సంచలనంగా మారింది.
ఆ ప్రకటనతో
ఐపీఎల్ 2025 నుంచి తప్పుకొంటున్నట్లు హ్యారీ బ్రూక్ తాజాాగా ప్రకటించాడు. సీజన్ కు ఇంకో 10 రోజుల కూడా లేని నేపథ్యంలో ఇప్పుడు బ్రూక్ తప్పుకోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజన్ ఆరంభానికి ముందు బ్రూక్ ఇలా చేయడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. బ్రూక్ పై బ్యాన్ విధించినట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి బీసీసీఐ సమాచారం అందించింది.
కొత్త రూల్స్
రెండేళ్ల పాటు ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ విధించిన విషయాన్ని బ్రూక్, ఈసీబీకి బీసీసీఐ తెలిపిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది. వేలంలో అమ్ముడుపోయిన తర్వాత వ్యక్తిగత కారణాలతో సీజన్ కు దూరమైతే చర్యలు తప్పవని బీసీసీఐ ఇప్పటికే రూల్స్ లో పేర్కొంది. ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకోవడానికి ముందే కొత్త రూల్స్ గురించి ఆటగాళ్లందరికీ బీసీసీఐ సమాచారమిచ్చింది.
కొత్త రూల్ ప్రకారం.. ‘‘వేలంలో నమోదు చేసుకుని, అమ్ముడుపోయిన ఆటగాడు ఆ సీజన్ లో జట్టుకు కచ్చితంగా ఆడాలి. గాయం లేకపోతే బరిలో దిగాలి. అంతేకానీ వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటే మాత్రం.. లీగ్ లో పాల్గొనకుండా రెండేళ్ల నిషేధం విధిస్తారు’’ అని ఐపీఎల్ ముందే స్పష్టం చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ కు
2024 నవంబర్ లో జరిగిన మెగా వేలంలో హ్యారీ బ్రూక్ ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కానీ ఇంగ్లండ్ జాతీయ జట్టు కమిట్మెంట్ కోసం ఐపీఎల్ 2025 నుంచి తప్పుకోవాలని బ్రూక్ నిర్ణయించుకున్నాడు. ఇదెంతో కఠినమైన నిర్ణయమని బ్రూక్ పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు, ఫ్యాన్స్ కు సారీ చెప్పాడు.
సరైందే చేస్తా
‘‘నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా దేశం కోసం ఆడాలని కలలు కన్నా. ఇష్టపడే ఆటను ఈ స్థాయిలో ఆడే అవకాశం లభించినందుకు చాలా కృతజ్ఞుడిని. ఇంగ్లాండ్ క్రికెట్ కు ఇది చాలా ముఖ్యమైన సమయం. రాబోయే సిరీస్ కోసం సిద్ధం కావడానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నా. సరైందే చేస్తా’’ అని బ్రూక్ పేర్కొన్నాడు.
నానమ్మ మరణంతో 2024 ఐపీఎల్ సీజన్ నుంచి కూడా బ్రూక్ వైదొలిగాడు. 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేసిన బ్రూక్ తన ఐపీఎల్ కెరీర్లో 11 మ్యాచుల్లో ఒక సెంచరీతో సహా 190 పరుగులు చేశాడు.
సంబంధిత కథనం