IPL 2024 Start Date: ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ తేదీ చెప్పేసిన చైర్మన్.. రెండు దశలుగా షెడ్యూల్
IPL 2024 Start Date: ఐపీఎల్ 2024 టోర్నీ ఎప్పుడు మొదలు కానుందో టోర్నీ చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. అలాగే, మ్యాచ్‍ల షెడ్యూల్ విషయంలోనూ విషయాలను వెల్లడించారు.
IPL 2024: ఈ ఏడాది ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన ఈ టీ20 లీగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే నిరీక్షణ ఉంది. ఈ ఏడాది భారత్‍లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో వేదిక మారుతుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఐపీఎల్ 2024 ప్రారంభ తేదీ, నిర్వహణ, మ్యాచ్‍ల షెడ్యూల్ ప్రకటన విషయాలపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తాజాగా కీలక విషయాలను వెల్లడించారు.
మొదలయ్యేది అప్పుడే
ఈ ఏడాది ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం అవుతుందని అరుణ్ ధుమాల్ వెల్లడించారు. న్యూస్ ఏజెన్సీ పీటీఐతో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. చెన్నైలో తొలి మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేశారు. “మార్చి 22వ తేదీన టోర్నమెంట్‍ను ప్రారంభించేందుకు చూస్తున్నాం. ప్రభుత్వం, ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని పని చేస్తున్నాం. త్వరలోనే ప్రాథమిక షెడ్యూల్ ప్రకటిస్తాం” అని అరుణ్ ధుమాల్ చెప్పారు.
రెండు దశలుగా షెడ్యూల్
ఐపీఎల్ 2024 సీజన్ కోసం మ్యాచ్‍ల షెడ్యూల్‍ను బీసీసీఐ ఈసారి రెండు దశలుగా ప్రకటించనుంది. ముందుగా 15 రోజులకు చెందిన మ్యాచ్‍ల తేదీలను వెల్లడించనుంది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‍ను బట్టి మ్యాచ్‍ల తేదీలను నిర్ణయించనుంది. ఈ విషయాన్ని కూడా ధుమాల్ వెల్లడించారు.
“ముందుగా తొలి 15 రోజుల ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటిస్తాం. లోక్‍సభ ఎన్నికల తేదీలు వచ్చాక.. మిగిలిన షెడ్యూల్ వెల్లడిస్తాం” అని ధుమాల్ చెప్పారు. దీంతో ఐపీఎల్ షెడ్యూల్ ఈసారి రెండు భాగాలుగా రానుంది. మార్చి మొదటి వారంలో తొలి దశ షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది.
తొలి మ్యాచ్ అక్కడే..
ఐపీఎల్ 2024 టోర్నీలో తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియంలో జరగనుంది. గతేడాది టైటిల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్ ఉండనుంది. గతేడాది విన్నర్‌గా నిలిచి.. ఐదు టైటిళ్లతో ఐపీఎల్‍లో అత్యంత సక్సెస్‍ఫుల్ టీమ్‍గా ముంబై ఇండియన్స్‌ను చెన్నై సమం చేసింది.
హార్దిక్ పాండ్యా మళ్లీ ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్లిపోవడంతో ఈ సీజన్‍లో గుజరాత్‍కు కెప్టెన్సీ చేయనున్నాడు యంగ్ స్టార్ శుభ్‍మన్ గిల్. 2017 నుంచి ఐపీఎల్‍లో ముంబై తరఫున ఆడిన పాండ్యా 2022లో గుజరాత్‍కు వెళ్లాడు. ఆ ఏడాది అతడి కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన టైటాన్స్, 2023లో ఫైనల్ వరకు వెళ్లి ఓడింది. 2024 సీజన్ కోసం గుజరాత్ నుంచి ట్రేడ్ చేసుకొని పాండ్యాను ముంబై తీసుకుంది. ఏకంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి అతడిని ఆ స్థానంలో నియమించింది.
కాగా, సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో ఐపీఎల్ సీజన్ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించింది బీసీసీఐ. 2014 సీజన్‍లో కొన్ని మ్యాచ్‍లను యూఏఈలో జరిపింది. 2019లో ఎన్నికలు ఉన్నా మొత్తం సీజన్ భారత్‍లోనే జరిగింది. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నా కూడా పూర్తిగా ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ డిసైడ్ అయింది.