IPL 2024: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు షాక్.. అంతా హార్దిక్ పాండ్యా చేతుల్లో!
IPL 2024 Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరబాద్‌కు పెద్ద షాక్ తగలనుంది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవడంతో సన్ రైజర్స్ చిక్కులో పడే అవకాశం కనిపిస్తోంది.
ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం హార్దిక్ పాండ్యా అని తెలుస్తోంది. తాజాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని తిరిగి ముంబై ఇండియన్స్‌తో చేతులు కలుపనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన సారథ్యంలో గుజరాత్ టైటాన్స్‌ను ముందుండి నడిపించిన హార్దిక్ జట్టు వీడనుండటంతో ఆ టీమ్ తదుపరి కెప్టెన్ ఎవరనేది కీలకంగా మారింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
ఈ నేపథ్యంలో తమ జట్టును ముందుండి నడిపించే సత్తా శుభ్‌మన్ గిల్‌కు ఉందని యాజమాన్యం భావిస్తోంది. దీంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ అవుతాడని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, రిటెన్షన్ ద్వారా శుభ్‌మన్ గిల్ ను కొనుగోలు చేసుకుని అతన్ని కెప్టెన్ గా చేయాలనుకుంది సన్ రైజర్స్ టీమ్. కానీ, ముంబై ఇండియన్స్ కు హార్దిక్ మొగ్గు చూపడంతో సన్ రైజర్స్ ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి.
ఒకవేళ హార్దిక్ గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉంటే శుభ్‌మన్ ఆ టీమ్‌కు కెప్టెన్ అయ్యే అవకాశం ఉండదు. కానీ, హార్దిక్ పాండ్యా ముంబై టీమ్‌కు వెళితే మాత్రం గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్ సారథి బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఎక్కువ అని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ కలత చెందుతున్నారు.
కాగా గత కొన్ని రోజులుగా పేలవమైన ప్రదర్శనతో కొనసాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్‌కు శుభ్‌మన్ గిల్‌ను తీసుకుని కెప్టెన్ గా బాధ్యతలు అప్పజెపితే జట్టుకు మంచిదని యాజమాన్యం భావించదట. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిందని పలు కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ, తాజాగా హార్దిక్ పాండ్యా నిర్ణయం సన్ రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు అంతా హార్దిక్ పాండ్యా చేతుల్లోనే ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.