IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 షెడ్యూల్‍ను ప్రకటించేందుకు డేట్, టైమ్ ఖరారు!
IPL 2024 Schedule Date: ఐపీఎల్ 2024 షెడ్యూల్ ప్రకటించేందుకు బీసీసీఐ రెడీ అయినట్టు సమాచారం బయటికి వచ్చింది. షెడ్యూల్ ప్రకటనకు డేట్, టైమ్ కూడా ఫిక్స్ చేసిందని వివరాలు వెల్లడయ్యాయి.
IPL 2024 Schedule: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్‍కు కసరత్తులు చేస్తోంది బీసీసీఐ. ఈ ఏడాది దేశంలో లోక్‍సభ ఎన్నికలు జరగనుండటంతో అందుకు అనుగుణంగా టోర్నీని నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. మార్చి 22వ తేదీన ఐపీఎల్ 2024 మొదలవుతుందని టోర్నీ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈ తరుణంలో ఐపీఎల్ 2024 తొలి దశ షెడ్యూల్ ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైందని సమాచారం బయటికి వచ్చింది. షెడ్యూల్ అనౌన్స్‌మెంట్‍కు డేట్, టైమ్‍ను కూడా ఫిక్స్ చేసేసిందని వివరాలు వెల్లడయ్యాయి.
డేట్, టైమ్!
ఐపీఎల్ 2024 సీజన్ తొలి దశ షెడ్యూల్‍ను బీసీసీఐ రేపు (ఫిబ్రవరి 22) ప్రకటిస్తుందని సమాచారం బయటికి వచ్చేసింది. ఇందుకు అన్ని ఏర్పాట్లను బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 టోర్నీ షెడ్యూల్‍ను ఫిబ్రవరి 21వ తేదీన 5 గంటలకు బీసీసీఐ వెల్లడించనుందని తెలుస్తోంది.
15 రోజులకే..
లోక్‍సభ ఎన్నికలు ఉండటంతో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‍ల తేదీలపై బీసీసీఐ తర్జనభర్జన పడుతోంది. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ తేదీని బట్టి అక్కడి వేదికల్లో మ్యాచ్‍లు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్‍ను రెండు దశల్లో ప్రకటించాలని బీసీసీఐ డిసైడ్ అయిందని తెలుస్తోంది. ముందుగా 15 రోజుల మ్యాచ్ షెడ్యూల్‍ను బీసీసీఐ రేపు (ఫిబ్రవరి 22) ప్రకటిస్తుందని సమాచారం. మార్చి 22న ఐపీఎల్ 2024 ప్రారంభం కానుండడం ఖాయంగా కనిపిస్తోంది.
లోక్‍సభ ఎన్నికలు ఉన్న తరుణంలో ప్రభుత్వం, సంస్థలతో సమన్వయం చేసుకుంటూ మ్యాచ్‍ల తేదీలను డిసైడ్ చేస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇటీవలే చెప్పారు. ఎన్నికలు ఉన్నా ఈసారి ఇండియాలోనే టోర్నీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
చెన్నైలోనే ఆరంభం
మార్చి 22వ తేదీన ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుండడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‍కు ముందు గ్రాండ్‍గా ఓపెనింగ్ సెర్మనీకి కూడా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. కళ్లు చెదిరేలా భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటోంది. గతేడాది ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ సింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్ జరుగుతుందని తెలుస్తోంది. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. హోమ్ గ్రౌండ్‍లోనే మరో టైటిల్ వేట మొదలుపెట్టనున్నారు.
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ, ఆరంభ మ్యాచ్ చెపాక్ స్టేడియంలో ఈ ఏడాది జరగనుండడం ఆనందగా ఉందని సీఎక్‍కే సీఈవో కాశీ విశ్వనాథ్ చెప్పినట్టు క్రిక్‍బజ్ రిపోర్ట్ వెల్లడించింది. డిఫెండింగ్ చాంపియన్‍గా ఆరంభ వేడుకకు ఆతిథ్యమివ్వడం గౌరవంగా భావిస్తున్నామని అన్నట్టు పేర్కొంది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీలను మార్చి మూడో వారంలో ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఐపీఎల్ 2024 పూర్తిస్థాయిగా రెండో దశ షెడ్యూల్‍ను బీసీసీఐ నిర్ణయిస్తుందని తెలుస్తోంది.
ఐపీఎల్ 2024 మార్చి 22న మొదలుకానుండగా.. మే 26వ తేదీన ఫైనల్ జరుగుతుందని తెలుస్తోంది.