RR vs DC Ipl 2024: లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ - రాజస్థాన్‌ను గెలిపించిన రియాన్ పరాగ్ - ఢిల్లీకి రెండో ఓటమి
RR vs DC Ipl 2024: గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. రియాన్ పరాగ్ సంచలన ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌ను గెలిపించాడు.

RR vs DC Ipl 2024: ఐపీఎల్‌లో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇది రెండో గెలుపు కాగా...ఢిల్లీ వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పోరాడిన ఢిల్లీ 20 ఓవర్లలో 173 పరుగులు మాత్రమే చేసింది. గెలుపు ముంగిట బోల్తా పడింది.
లాస్ట్ ఓవర్‌లో...
లాస్ట్ ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లుగా థ్రిల్లింగ్‌గా ఈ మ్యాచ్ సాగింది. చివరి ఓవర్‌లో ఢిల్లీ గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా...రాజస్థాన్ పేసర్ ఆవేశ్‌ఖాన్ సంచలన బౌలింగ్‌తో ఆ జట్టుకు షాకిచ్చాడు. లాస్ట్ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రాజస్థాన్‌ను గెలిపించాడు.
రియాన్ పరాగ్ సంచలన ఇన్నింగ్స్...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఐదు వికెట్ల నష్టపోయి 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ ఒంటరి పోరాటంతో రాజస్థాన్‌కు భారీ స్కోరు అందించాడు. 45 బల్స్‌లోనే ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 84 పరుగులు చేసిన రియాన్ పరాగ్ నాటౌట్‌గా మిగిలాడు.
ఇన్నింగ్స్ ఆరంభమైన రెండో ఓవర్‌లోనే రాజస్థాన్‌కు షాక్ తగిలింది. హిట్టర్ యశస్వి జైస్వాల్ ఐదు పరుగులు వద్ద ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత జోస్ బట్లర్, సంజూ శాంసన్ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు.
అశ్విన్ సహకారంతో...
అశ్విన్‌తో కలిసి రియాన్ పరాగ్ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే కాకుండా రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో రియాన్ పరాగ్ రెచ్చిపోయాడు. పరాగ్‌కు అశ్విన్ చక్కటి సహకారం అందించాడు. 19 బాల్స్‌లో మూడు సిక్సర్లతో 29 ర న్స్ చేశాడు. ధ్రువ్ జురేల్ 12 బాల్స్‌లో ఇరవై రన్స్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతోన్న తన జోరును మాత్రం ఆపలేదు పరాగ్. ఎన్రిచ్ నోక్యా వేసిన చివరి ఓవర్‌లో పరాగ్ విశ్వరూపమే చూపించాడు. వరుసగా 4, 4, 6, 4, 6, 1 తో ఏకంగా 25 రన్స్ చేశాడు.
వార్నర్ శుభారంభం...
186 పరుగులు భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీకి వార్నర్, మార్ష్ చక్కటి శుభారంభాన్ని అందించారు. పది రన్‌రేట్‌తో బ్యాటింగ్ చేశారు. కానీ వారి జోరు ఎక్కువ సమయం పాటు సాగలేదు. 12 బాల్స్‌లోనే ఐదు ఫోర్లతో 23 రన్స్ చేసిన మార్ష్ ...బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన రికీ భుయ్ డకౌట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. పంత్‌తో కలిసి వార్నర్ ఢిల్లీని గెలుపు దిశగా నడిపించాడు. 34 బాల్స్‌లో 3 సిక్సర్లు, ఐదు ఫోర్లతో 49 పరుగులు చేసిన వార్నర్ హాఫ్ సెంచరీకి ఓ పరుగు దూరంలో ఔటయ్యాడు. రిషబ్ పంత్ ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. 26 బాల్స్‌లో ఓ సిక్సర్, రెండు ఫోర్లతో 28 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.
స్టబ్స్ ఎదురుదాడి...
స్టబ్స్ రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఢిల్లీని గెలుపు దిశగా నడిపించాడు. స్టబ్స్ 23 బాల్స్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 44 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లోఢిల్లీ గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా...క్రీజులో స్టబ్స్, అక్షర్ పటేల్ ఉండటంతో ఆ జట్టే గెలుస్తుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ కట్టుదిట్టగా బౌలింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ ఆ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రాజస్థాన్‌ను గెలిపించాడు. భారీ షాట్స్ ఆడేందుకు స్టబ్స్, అక్షర్ పటేల్‌కు ఆవేశ్ ఖాన్ అవకాశం ఇవ్వలేదు.