PBKS vs MI Live: సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మెరుపులు.. ముంబై ఇండియన్స్ భారీ స్కోరు-ipl 2024 pbks vs mi live score suryakumar yadav tilak varma take mumbai indians to huge total against punjab kings ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pbks Vs Mi Live: సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మెరుపులు.. ముంబై ఇండియన్స్ భారీ స్కోరు

PBKS vs MI Live: సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మెరుపులు.. ముంబై ఇండియన్స్ భారీ స్కోరు

Hari Prasad S HT Telugu

PBKS vs MI Live: పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్, తిలక్ వర్మ, రోహిత్ శర్మ చెలరేగడంతో పంజాబ్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మెరుపులు.. ముంబై ఇండియన్స్ భారీ స్కోరు (AFP)

PBKS vs MI Live: ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. మొహాలీలోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో అత్యధిక స్కోరు సాధించడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతోపాటు తిలక్ వర్మ, రోహిత్ శర్మ మెరుపులతో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది.

సూర్యకుమార్ 53 బంతుల్లో 78 పరుగులు, రోహిత్ శర్మ 25 బంతుల్లో 36, తిలక్ వర్మ 18 బంతుల్లో 34 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ చివరి ఐదు ఓవర్లలో 62 రన్స్ చేసింది. నిజానికి ముంబై 200 పరుగులు దాటేలా కనిపించినా.. చివరి ఓవర్లో హర్షల్ పటేల్ కేవలం 7 పరుగులే ఇచ్చాడు. అంతేకాదు మూడు వికెట్లు కూడా పడ్డాయి.

సూర్య మెరుపులు

పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది ముంబై ఇండియన్స్. ఆ టీమ్ ఓపెనర్ ఇషాన్ కిసన్ (8) విఫలమయ్యాడు. దీంతో 18 పరుగుల దగ్గరే తొలి వికెట్ కోల్పోయింది. అయితే రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇద్దరూ కలిసి ముంబై ఇన్నింగ్స్ ను మళ్లీ గాడిలో పెట్టారు. 250వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ మంచి టచ్ లో కనిపించాడు.

అతడు 25 బంతుల్లో 3 సిక్స్ లు, 2 ఫోర్లతో 36 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంతో 81 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్ ఔటైనా సూర్య మాత్రం తన హిట్టింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలో 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతని ఊపు చూస్తే సెంచరీ చేయడం ఖాయంగా కనిపించింది. అయితే 53 బంతుల్లో 78 రన్స్ చేసిన తర్వాత ఔటయ్యాడు.

సూర్య ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. గాయం నుంచి కోలుకొని వచ్చిన తర్వాత తొలి మ్యాచ్ లో డకౌటైన సూర్య.. ఆ తర్వాత నుంచి తనదైన స్టైల్లో చెలరేగుతున్నాడు. ఇది టీమిండియాకు గుడ్ న్యూసే. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ఉండటంతో సూర్య టాప్ ఫామ్ లో ఉండటం ఇండియన్ టీమ్ కు ఎంతో అవసరం.