IPL 2024: పిల్లల స్కూలు ఫీజు కట్టకుండా రూ.64 వేలు పెట్టి ధోనీ ఆట చూడటానికి వచ్చాడు.. వెర్రి అభిమానం అంటూ..-ipl 2024 ms dhoni fan who skipped his children school fees spends 64000 to see csk playing ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024: పిల్లల స్కూలు ఫీజు కట్టకుండా రూ.64 వేలు పెట్టి ధోనీ ఆట చూడటానికి వచ్చాడు.. వెర్రి అభిమానం అంటూ..

IPL 2024: పిల్లల స్కూలు ఫీజు కట్టకుండా రూ.64 వేలు పెట్టి ధోనీ ఆట చూడటానికి వచ్చాడు.. వెర్రి అభిమానం అంటూ..

Hari Prasad S HT Telugu
Apr 12, 2024 10:39 PM IST

IPL 2024: ధోనీ, సీఎస్కే అభిమాని ఒకరు పిల్లల స్కూలు ఫీజు కట్టకుండా రూ.64 వేలు పెట్టి ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వచ్చాడు. అతని కామెంట్స్ వైరల్ అవడంతో నెటిజన్లు అతనిపై తీవ్రంగా మండిపడుతున్నారు.

పిల్లల స్కూలు ఫీజు కట్టకుండా రూ.64 వేలు పెట్టి ధోనీ ఆట చూడటానికి వచ్చాడు
పిల్లల స్కూలు ఫీజు కట్టకుండా రూ.64 వేలు పెట్టి ధోనీ ఆట చూడటానికి వచ్చాడు (CSK-X)

IPL 2024: క్రికెటర్లపై అభిమానం ఉండాలి కానీ మరీ ఇంతలా వెర్రి అభిమానం కూడా సరి కాదు. ఐపీఎల్ 2024లో ధోనీ ఆటను చూడటానికి కొందరు అభిమానులు అన్ని హద్దులూ దాటేస్తున్నారు. తాజాగా చెన్నైకి చెందిన ఓ అభిమాని తన పిల్లల స్కూలు ఫీజు కూడా కట్టకుండా.. ఏకంగా రూ.64 ఖర్చు పెట్టి సీఎస్కే మ్యాచ్ టికెట్లు కొన్నట్లు చెప్పడం గమనార్హం.

అభిమానం కాదు పిచ్చి

ధోనీ అభిమాని ఈ మాట చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అభిమానికి ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ల స్కూలు ఫీజు తాను ఇంత వరకూ కట్టలేదని, అయితే మ్యాచ్ టికెట్ల కోసం మాత్రం రూ.64 వేలు ఖర్చు పెట్టినట్లు అతడు తమిళంలో చెబుతున్న వీడియో అది. ఈ వీడియోను డాక్టర్ జైసన్ ఫిలిప్ అనే వ్యక్తి ఎక్స్ లో షేర్ చేశాడు.

"నా పిల్లల స్కూలు ఫీజు కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, కానీ మ్యాచ్ టికెట్ల కోసం రూ.64 వేలు ఖర్చు పెట్టానని ఈ తండ్రి చెబుతున్నాడు. అతడి మూర్ఖత్వాన్ని వర్ణించడానికి నాకు మాటలు చాలడం లేదు" అనే క్యాప్షన్ తో ఆ వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. అది చూసి చాలా మంది నెటిజన్లు కూడా అతడితో ఏకీభవించారు.

ఆ వీడియోలో సదరు అభిమాని మాట్లాడుతూ.. తాను బ్లాక్ లో టికెట్లు కొన్నట్లు చెప్పడం విశేషం. ఈ మధ్యే చెపాక్ స్టేడియంలో సీఎస్కే, కేకేఆర్ మధ్య మ్యాచ్ ను అతడు ప్రత్యక్షంగా చూశాడు. "నాకు టికెట్లు దొరకలేదు. అందుకే బ్లాక్ లో కొన్నాను. మొత్తంగా రూ.64 వేలు అయింది. నేను ఇంకా స్కూలు ఫీజు కట్టలేదు. కానీ ధోనీని కనీసం ఒకసారి చూడాలని అనుకున్నాను" అని ఆ అభిమాని స్పోర్ట్స్‌వాక్ చెన్నై ఛానెల్ తో చెప్పాడు.

తన తండ్రి టికెట్లు సంపాదించడానికి పడిన కష్టాన్ని పక్కనే ఉన్న కూతురు కూడా చెప్పింది. ధోనీ బ్యాటింగ్ చేయడానికి రావడం తమకు సంతోషం కలిగించిందని తెలిపింది. అయితే ఆ అభిమాని కామెంట్స్ మాత్రం పాజిటివ్ గా కంటే నెగటివ్ గానే ఎక్కువగా జనాల్లోకి వెళ్లాయి. స్కూలు ఫీజు కట్టకుండా మ్యాచ్ చూడటానికి రావడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ధోనీ క్రేజ్

నిజానికి గత రెండు మూడు సీజన్లుగా ఐపీఎల్లో ధోనీ క్రేజ్ మామూలుగా ఉండటం లేదు. ఒక్క చెన్నైలోనే కాదు ఇండియాలో ఎక్కడికి వెళ్లినా ధోనీ ఆట చూడటానికి అభిమానులు పోటెత్తుతున్నారు. అతడు కనిపిస్తే చాలు హోరెత్తిస్తున్నారు. బహుషా ధోనీ ఆడనున్న చివరి ఐపీఎల్ సీజన్ ఇదే కావచ్చన్న ఉద్దేశంతో ఈసారి ఈ క్రేజ్ మరో లెవల్ కు వెళ్లింది.

ఈ సీజన్ ప్రారంభానికి ముందు ధోనీ సీఎస్కే కెప్టెన్సీని వదిలేసిన విషయం తెలిసిందే. అయినా అతనికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరిగింది. దేశంలోని అన్ని వేదికలూ ధోనీ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు హోమ్ గ్రౌండ్ లానే ఉంటున్నాయి.

Whats_app_banner