MI vs RCB Probable Final XIs: నేడు ముంబై, బెంగళూరు బిగ్ క్లాష్.. ఆర్సీబీలోకి జాక్స్ రానున్నాడా? తుది జట్లు ఇలా!
MI vs RCB Probable Final XIs: ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు నేడు (ఏప్రిల్ 11) తలపడనున్నాయి. ఈ సీజన్‍లో తడబడుతున్న రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా ఉంది. ఈ మ్యాచ్‍లో తుది జట్లు ఎలా ఉండే అవకాశం ఉందంటే..
MI vs RCB Probable Final XIs: ఐపీఎల్ 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు అంతా రెడీ అయింది. ఈ సీజన్‍లో ఐదు మ్యాచ్‍ల్లో ఒకటి గెలిచి బెంగళూరు చతికిపడితే .. ముంబై కూడా నాలుగింట ఒకటి మాత్రమే గెలిచింది. ఈ ఇరు జట్ల మధ్య నేడు (ఏప్రిల్ 11) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. భారత స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తలపడుతుండటంతో ఈ మ్యాచ్‍కు ఫుల్ క్రేజ్ ఉంది. ఈ మ్యాచ్‍లో తుది జట్లు ఎలా ఉండే అవకాశం ఉందంటే..
ఈ సీజన్‍లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడుతున్న ముంబై ఇండియన్స్ తొలి మూడు మ్యాచ్‍లు ఓడింది. అయితే, గత మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి బోణీ కొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా గత మూడు మ్యాచ్‍ల్లో ఓటములతో చతికిలపడింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ వరుసగా విఫలమవుతూనే ఉన్నారు. విరాట్ కోహ్లీ ఒక్కడే అలుపెరుగకుండా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో ముంబైతో మ్యాచ్‍కు తుది జట్టులో బెంగళూరు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి.
గ్రీన్ ఔట్! విల్ జాక్స్‌కు చోటు
ఈ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ నుంచి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‍ను బెంగళూరు ట్రేడ్ చేసుకుంది. అయితే, గ్రీన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‍ను తేలిపోయాడు. దీంతో ముంబై ఈ మ్యాచ్‍కు గ్రీన్ స్థానంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్‌ను తీసుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‍తో జాక్స్ ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ గ్రీన్ ఉండాలనుకుంటే.. పేలవ ఫామ్‍లో ఉన్న మ్యాక్స్‌వెల్‍ను తప్పించి అయినా జాక్స్‌ను తీసుకోవచ్చు.
బిగ్‍బ్యాష్, పీఎస్ఎల్ సహా వివిధ లీగ్‍ల్లో భారీ హిట్టర్‌గా ఫేమస్ అయిన విల్ జాక్స్.. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా వేస్తాడు. దీంతో గ్రీన్ ప్లేస్‍లో అతడిని తీసుకోవాలని బెంగళూరు మేనేజ్‍మెంట్ ఆలోచిస్తోంది. అలాగే బౌలింగ్‍నూ ఆర్సీబీ తీవ్రంగా నిరాశపరుస్తోంది. దీంతో లూకీ ఫెర్గ్యూసన్‍ను పేరును కూడా తుది జట్టు కోసం పరిశీలించే ఛాన్స్ ఉంది.
ముంబై ఇండియన్స్ మాత్రం గత మ్యాచ్‍లో ఆడిన తుది జట్టునే బెంగళూరుతో పోటీకి కొనసాగించే అవకాశం ఉంది. హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టులోకి వచ్చేయటంతో ముంబై మరింత బలంగా కనిపిస్తోంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మంచి టచ్‍లో కనిపిస్తుండగా.. స్టార్ పేసర్ బుమ్రా అదరగొడుతున్నాడు.
ముంబై, బెంగళూరు హెడ్ టూ హెడ్
ఐపీఎల్‍లో ఇప్పటి వరకు ముంబై, బెంగళూరు జట్లు పరస్పరం 32 మ్యాచ్‍లు ఆడాయి. వీటిలో 18 మ్యాచ్‍ల్లో ముంబై గెలిచింది. 14సార్లు బెంగళూరు విజయం సాధించింది. ఈ రెండు జట్లు మధ్య చివరి ఐదు మ్యాచ్‍ల్లో నాలుగుసార్లు బెంగళూరు గెలిచింది. వాంఖడే స్టేడియం వేదికగా ఈ ఇరు జట్లు పరస్పరం 10సార్లు తలపడగా.. 7సార్లు ముంబై గెలిచింది.
తుది జట్లు ఇలా..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు (అంచనా): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, విల్ జాక్స్, సౌరవ్ చౌహాన్/సుయాష్ ప్రభుదేశాయ్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), రీస్ టోప్లే, మయాంక్ దగర్, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్
ముంబై ఇండియన్స్ తుదిజట్టు (అంచనా): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వల్