Prithvi Shaw: క్రమశిక్షణ తప్పిన టీమిండియా యంగ్ ఓపెనర్‌కి కఠిన శిక్ష , ఇకనైనా తీరు మార్చుకునేనా?
Ranji Trophy: గత మూడేళ్లుగా భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న పృథ్వీ షా వరుస వివాదాలతో తన కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చేసుకుంటున్నాడు. క్రమశిక్షణ తప్పడం, ఫిట్‌నెస్ లేకపోవడంతో అతడు ముంబయి జట్టులో చోటు కోల్పోయాడు.
టీమిండియా యంగ్ ఓపెనర్ పృథ్వీ షా మరోసారి చిక్కుల్లో పడ్డాడు. గత మూడేళ్లుగా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో వరుస వివాదాల్లో ఉంటున్న పృథ్వీ షాపై ముంబయి క్రికెట్ అసోషియేషన్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. మూడు ఫార్మాట్లలోనూ మెరిసి అనూహ్యంగా భారత్ జట్టుకి దూరమైపోయాడు.
టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఒకవైపు దేశవాళీ క్రికెట్‌లో పరుగులు చేస్తున్న పృథ్వీ షా.. మరోవైపు క్రమశిక్షణ తప్పి సెలెక్టర్లపై నోరుజారుతూ జట్టుకి దూరమైపోతున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీలో ముంబయి జట్టు నుంచి కూడా పృథ్వీ షాను తప్పించారు.
ముంబయి జట్టు తరఫున పృథ్వీ షా ఇప్పటి వరకు 41 రంజీ మ్యాచ్‌లు ఆడాడు. అయితే.. తాజాగా రంజీ ట్రోఫీ మ్యాచ్ నుంచి పృథ్వీ షాను తప్పిస్తున్నట్లు ముంబయి క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనని విడుదల చేసింది.
అధిక బరువు.. క్రమశిక్షణ లేదు
24 ఏళ్ల పృథ్వీ షా గత కొంతకాలంగా ముంబయి జట్టులో క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్లు ముంబయి క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదులు వచ్చాయట. ఫిట్‌నెస్‌పై ఏ మాత్రం శ్రద్ధ పెట్టని పృథ్వీ షా.. అధిక బరువుతో ఉన్నాడని ఫిజియోలు, నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌కి హాజరు కావట్లేదని ముంబయి టీమ్ మేనేజ్‌మెంట్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
నెట్ సెషన్స్‌లో కూడా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడని.. టైమ్ టేబుల్ పాటించడం లేదని ముంబయి ఆటగాళ్లు ఫిర్యాదు చేశారట. మరీ ముఖ్యంగా.. ప్రాక్టీస్ సెషన్లకి డుమ్మా కొట్టేస్తున్నాడని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంజయ్ పాటిల్ (చైర్మన్), రవి థాకర్, జితేంద్ర థాకరే, కిరణ్ పవార్, విక్రాంత్ యెలిగేట్లతో కూడిన ముంబై సెలక్షన్ కమిటీ.. పృథ్వీ షాను కనీసం ఒక మ్యాచ్‌కి దూరంగా పెట్టాలని నిర్ణయించింది. అప్పుడే ఈ ఓపెనర్‌కు అది ఒక గుణపాఠం అవుతుందని సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం భావించినట్లు తెలుస్తోంది.
ఆరేళ్లుగా ఇదే వరస
2018లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా ఇప్పటి వరకు 5 టెస్టులు, 6 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో ఒక సెంచరీ మాత్రమే చేసిన పృథ్వీ షా.. గాయాలు, క్రమశిక్షణ లేని కారణంగా కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నాడు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నగిల్‌తో రోడ్డుపై గొడవపడి పరువు పొగొట్టుకున్నాడు. ఆ వ్యవహారం కేసులు, కోర్టుల వరకూ వెళ్లడంతో ఈ యంగ్ ఓపెనర్ రెప్యూటేషన్ మంటగలిసిపోయింది. అయినప్పటికీ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా.. కాంట్రవర్సీల చుట్టూనే తిరుగుతున్నాడు.