INDW vs UAEW Asia Cup: భారీ విజయంతో సెమీస్‍లో అడుగుపెట్టిన భారత్.. ఓ రికార్డు కూడా..
INDW vs UAEW Asia Cup 2024: ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు మరో విజయం సాధించింది. యూఏఈపై ఘనంగా గెలిచి సెమీఫైనల్ చేరింది. ఓ రికార్డు కూడా నమోదు చేసింది.
ఆసియా కప్ 2024 టోర్నీలో భారత మహిళల జట్టు మరోసారి దుమ్మురేపింది. వరుసగా రెండో విజయం సాధించి సెమీఫైనల్‍లో అడుగుపెట్టింది. దంబుల్లా వేదికగా నేడు (జూలై 21) జరిగిన ఆసియాకప్ గ్రూప్-ఏ మ్యాచ్‍లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మహిళల జట్టుపై టీమిండియా 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్‍లో అడుగుపెట్టింది హర్మన్‍ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్. మ్యాచ్ ఎలా సాగిందంటే..
దుమ్మురేపిన రిచా, హర్మన్
ఈ మ్యాచ్‍లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది భారత్. కెప్టెన్ హర్మన్‍ప్రీత్ కౌర్ 47 బంతుల్లోనే 66 పరుగులతో అదరగొట్టారు. 7 ఫోర్లు, ఓ సిక్స్ బాది హాఫ్ సెంచరీ చేశారు. టీమిండియా హిట్టర్ రిచా ఘోష్ మెరుపులు మెరిపించి అజేయ అర్ధ శకతం సాధించారు. 29 బంతుల్లోనే 64 పరుగులతో రిచా ధనాధన్ బ్యాటింగ్ చేశారు. యూఏఈ బౌలర్లను చితకబాదేశారు. ఏకంగా 12 ఫోర్లు కొట్టిన రిచా ఘోష్.. ఓ సిక్స్ సాధించారు. మొత్తంగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది.
టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన (13) త్వరగా ఔటైనా షెఫాలీ వర్మ (18 బంతుల్లో 37 పరుగులు) కాసేపు అదరగొట్టారు. దీంతో 5వ ఓవర్లోనే భారత్ స్కోరు 50 దాటింది. ఐదో ఓవర్ చివరి బంతికే షెఫాలీ ఔట్ కాగా.. దయాలన్ హేమలత (2) వెంటనే ఔటయ్యారు. జెమీమా రోడ్రిగ్స్ (14) కాసేపే నిలిచారు.
ఆ తర్వాత భారత స్టార్లు హర్మన్‍ప్రీత్ కౌర్, రిచా ఘోష్ హిట్టింగ్‍తో మోతెక్కించారు. యూఏఈ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. హర్మన్ 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరారు. దూకుడుగా ఆడిన రిచా ఘోష్ 26 హంతుల్లోనే అర్ధ శతకం మార్క్ అందుకున్నారు. ఈ ఇద్దరూ బౌండరీలతో దుమ్మురేపారు. హర్మన్ చివరి ఓవర్లో ఔట్ కాగా.. రిచా అజేయంగా నిలిచారు.
రికార్డు సృష్టించిన భారత్
ఈ మ్యాచ్‍లో భారత్ 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. 2018లో ఇంగ్లండ్‍పై చేసిన 198 పరుగులే ఇప్పటి వరకు హయ్యెస్ట్ స్కోరుగా ఉండేది. నేడు యూఏఈపై 201 పరుగులు చేసి.. అంతర్జాతీయ టీ20ల్లో తన అత్యధిక స్కోరు రికార్డు సృష్టించింది భారత వుమెన్ టీమ్. 200 పరుగుల మార్క్ తొలిసారి దాటింది.
యూఏఈని కట్టడి చేసిన బౌలర్లు
భారీ లక్ష్యఛేదనలో యూఏఈ బ్యాటర్లు భారత్‍కు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. టీమిండియా బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ కట్టడి చేశారు. దీంతో 20 ఓవర్లలో యూఏఈ 7 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేసి.. ఓటమి పాలైంది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ ఈశా ఓజా (38) రాణించగా.. చివర్లో కవిషా ఇగోడేజ్ (40 నాటౌట్) పోరాడారు. అయితే, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.
భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు దక్కించుకున్నారు. రేణుక సింగ్, తనూజా కన్వర్, పూజా వస్త్రాకర్, రాధాయాదవ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
గ్రూప్ దశలో జూలై 23న నేపాల్‍తో భారత మహిళల జట్టు తలపడనుంది. అయితే, వరుసగా రెండు విజయాలతో గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే సెమీస్ చేరింది టీమిండియా.