Team India for T20 World Cup: టీ20 ప్రపంచకప్‍నకు భారత జట్టు ఎంపిక ఎప్పుడంటే..!
Team India for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సెలెక్టర్లు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందో సమాచారం బయటికి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మతో సెలెక్టర్ల సమావేశం ఎప్పుడు ఉండనుందో తెలిసింది. ఆ వివరాలివే..
T20 World Cup 2024: ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతుండగా.. మరోవైపు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం కూడా ఉత్కంఠగా మారింది. జూన్‍లో జరిగే ఈ ప్రపంచకప్ మెగాటోర్నీకి 15 మంది ఆటగాళ్లతో టీమిండియాను సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ముందుగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సమావేశం కానున్నారు. కాగా, వీరు ఎప్పుడు సమావేశం కానున్నారో.. జట్టు ప్రకటన ఎప్పుడు ఉండనుందో సమాచారం బయటికి వచ్చింది.
మీటింగ్ అప్పుడే!
టీ20 ప్రపంచకప్‍కు భారత జట్టు ఎంపికపై రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య సమావేశం ఏప్రిల్ 27 లేకపోతే ఏప్రిల్ 28వ తేదీన జరగనుందని దైనిక్ జాగరన్ రిపోర్ట్ వెల్లడించింది. ఏప్రిల్ 27వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆ సమయంలో ముంబై తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ ఢిల్లీలోనే ఉండనున్నాడు. అప్పుడే అతడిని అగార్కర్ సహా సెలెక్టర్లు కలవనున్నారని ఆ రిపోర్ట్ పేర్కొంది.
వెకేషన్‍లో అగార్కర్
భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం స్పెయిన్‍లో వెకేషన్‍లో ఉన్నారు. అయితే, ఏప్రిల్ 27వ తేదీన ఆయన ఇండియాకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏప్రిల్ 27 లేదా 28వ తేదీన టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఆటగాళ్ల ఎంపిక గురించి రోహిత్ శర్మతో చర్చించనున్నారు. అప్పుడే భారత జట్టు ప్రకటన కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన ఆటగాళ్ల జాబితాను మే 1వ తేదీలోగా అంతర్జాతీయ క్రికెట్ (ఐసీసీ)కి అన్ని జట్లు సమర్పించాల్సి ఉంది.
వీరికి ప్లేక్ పక్కా!
టీ20 ప్రపంచకప్‍కు 15 మంది ఆటగాళ్లతో ఎంపిక చేసే జట్టులో.. ఇప్పటికే దాదాపు తొమ్మిది మందికి ప్లేస్ దాదాపు ఖరారైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, జస్‍ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ ఉండడం కచ్చితంగా కనిపిస్తోంది.
మరోవైపు, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుత ఐపీఎల్‍లో అతడి పర్ఫార్మెన్స్ బట్టి సెలెక్టర్లు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బౌలింగ్‍లో రాణిస్తేనే ప్రపంచకప్‍లో అవకాశం ఉంటుందని హార్దిక్‍కు సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‍ల్లో కేవలం 141 పరుగులే చేశాడు. 15 ఓవర్లు మాత్రమే వేసి 4 వికెట్లు పడగొట్టాడు.
ఓపెనింగ్ బ్యాకప్ స్లాట్ కోసం యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్‍లో టీమిండియాలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. ఒకవేళ వారిద్దరినీ తీసుకోవాలంటే శివం దూబే, రింకూ సింగ్‍లో ఒకరిని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. అయితే, భారీ హిట్టింగ్‍తో మెరిపిస్తున్న దూబే, రింకూ ఇద్దరికీ టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ప్లేస్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇక, ఐపీఎల్‍లో అదరగొడుతున్న సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‍పై కూడా సెలెక్టర్లు చర్చించనున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్ ఎవరనే విషయంలోనూ ఉత్కంఠ ఉంది.
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి జూన్ 29 వరకు జరగనుంది. ఈ మెగాటోర్నీలో జూన్ 5న ఐర్లాండ్‍తో జరిగి మ్యాచ్‍లో వేట మొదలుపెట్టనుంది భారత్.