Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక ఆలస్యం! ముందుగా ఇంగ్లండ్‍తో టీ20లకు టీమ్ ప్రకటన.. ఆ ముగ్గురు లేకుండా!
Team India: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఐసీసీకి బీసీసీఐ ఓ రిక్వెస్ట్ కూడా చేసిందట. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‍లో టీమిండియా విఫలం కావడంతో ఈ టోర్నీకి జట్టు ఎంపికపై ఆసక్తి ఎక్కువగా ఉంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే ఇంగ్లండ్‍తో జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‍లను భారత్ ఆడనుంది. ఈ సిరీస్‍లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి జట్లును టీమిండియా సెలెక్టర్లు ఒకేసారి ప్రకటిస్తారనే అంచనాలు గతంలో వచ్చాయి. అయితే, ఇందులో మార్పు ఉండనుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..
ముందుగా టీ20 సిరీస్‍కు..
ఇంగ్లండ్‍తో జనవరి 12 నుంచి ఫిబ్రవరి 2 మధ్య జరిగే ఐదు టీ20ల సిరీస్‍కు ముందుగా భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఈ తర్వాతే ఇంగ్లండ్‍తో వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీకి జట్లను ప్రకటించాలని బీసీసీఐ నిర్ణయించిందని తెలుస్తోంది. గతేడాది ఆగస్టు తర్వాతి నుంచి భారత్ ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్‍తో జరిగే వన్డే సిరీస్‍ను ప్రిపరేషన్‍గా టీమిండియా భావిస్తోంది.
ఐసీసీకి రిక్వెస్ట్!
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19వ తేదీన మొదలుకానుంది. టోర్నీ ప్రారంభమయ్యే ఐదు వారాలోగా అంటే జనవరి 12వ తేదీలోపు ఎంపిక చేసిన జట్లను వెల్లడించాలని ఐసీసీ గడువు విధించింది. అయితే, గడువు పొడగింపు కోసం ఐసీసీని బీసీసీఐ రిక్వెస్ట్ చేసిందని తెలుస్తోంది. ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్‍లో ఉండే ఆటగాళ్లనే ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసేందుకు సెలెక్టర్లు ఆలోచిస్తున్నారని, అందుకే ఎంపికకు కసరత్తు చేసేందుకు గడువు పొడగింపును బీసీసీఐ అడుగుతోందని క్రిక్‍బజ్ రిపోర్ట్ పేర్కొంది.
జట్టు ప్రకటన ఎప్పుడు ఉండొచ్చు?
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును సెలెక్టర్లు జనవరి 18 లేకపోతే జనవరి 19న ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పుడే ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్ జట్టుపై కూడా ప్రకటన వస్తుందని సమాచారం. అంతకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో సెలెక్షన్ కమిటీ సభ్యులు సమావేశమై చర్చించనున్నారు. జట్టులో ఎవరు ఉండాలో, ప్రస్తుత పరిస్థితి ఏంటో వారు ముచ్చటించనున్నారు.
టీ20 సిరీస్‍కు ఆ ముగ్గురు దూరం
ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍కు జట్టును శనివారం (జనవరి 11) లేకపోతే ఆదివారం (జనవరి 12) సెలెక్టర్లు ప్రకటించనున్నారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‍లో గాయపడిన స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‍కు దూరం కానున్నాడు. అతడు ఛాంపియన్స్ ట్రోఫీ అయినా ఆడతాడా అనే అనుమానాలు ఉన్నాయి. శుభ్‍మన్ గిల్, రిషబ్ పంత్‍ను కూడా టీ20 సిరీస్‍కు సెలెక్టర్లు ఎంపిక చేయరని అంచనాలు ఉన్నాయి. టీ20 జట్టులో తెలుగు ప్లేయర్లు నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ ఇద్దరికీ ప్లేస్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇంగ్లండ్‍తో భారత టీ20 సిరీస్ జనవరి 22న మొదలవుతుంది. ఫిబ్రవరి 2న ముగుస్తుంది. మూడు వన్డేలు ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 12న మధ్య జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాతో మ్యాచ్‍తో ఛాంపియన్స్ ట్రోఫీ పోరును భారత్ మొదలుపెట్టనుంది. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‍లను దుబాయి వేదికగా టీమిండియా ఆడనుంది.
సంబంధిత కథనం