ఇండియన్ క్రికెట్ టీమ్ కు కెప్టెన్ అంటే ఉండే ప్రెషర్ అంతా ఇంతా కాదు. కోట్లాది మంది ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకుంటారు. ప్రతి ఇన్నింగ్స్ ను గమనిస్తారు. అపోనెంట్ టీమ్స్ స్పెషల్ ప్లాన్స్ వేసుకుంటాయి. అలాంటి ప్రెషర్ లోనూ అదరగొట్టే విరాట్ కోహ్లి లాంటి కెప్టెన్ ను చూశాం. ఇప్పుడు యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆ ఘన వారసత్వాన్ని అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు.
భారత టెస్టు కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ కు ఇంగ్లాండ్ తో సిరీస్ మొదటిది. ఈ సిరీస్ తోనే సారథిగా శుభ్‌మన్ జర్నీ స్టార్ట్ అయింది. పైగా ఈ సిరీస్ కు ముందు విదేశాల్లో గిల్ టెస్టు ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. దీంతో గిల్ ఇంగ్లాండ్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ సెంచరీల మీద సెంచరీలు బాదేస్తూ గిల్ అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో గిల్ మరో హండ్రెడ్ అందుకున్నాడు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఈ రోజు (జూలై 5) శుభ్‌మన్ గిల్ సెంచరీ కంప్లీట్ చేశాడు. దూకుడుగా ఆడిన భారత కెప్టెన్ కేవలం 129 బంతుల్లోనే హండ్రెడ్ అందుకున్నాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి. ఇదే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో గిల్ డబుల్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్ లో 387 బంతుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడి 269 పరుగులు చేశాడు. 30 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు.
ఇంగ్లాండ్ తో పరుగుల వరద పారిస్తున్న శుభ్‌మన్ గిల్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో గిల్ 147 రన్స్ చేశాడు. ఇప్పుడు సెకండ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో శతకం సాధించాడు. దీంతో సునీల్ గవాస్కర్ తర్వాత ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్ గా గిల్ నిలిచాడు.
అలాగే ఒకే టెస్టు మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా సునీల్ గవాస్కర్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. 1971లో వెస్టిండీస్ తో టెస్టులో సన్నీ 344 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో గిల్ సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీతో ఇప్పటికే 369 పరుగులు రాబట్టాడు. ఇంతే కాకుండా టెస్టు ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు చేసిన ఇండియన్ కెప్టెన్ కూడా అతడే.
సంబంధిత కథనం