Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్.. స్టార్ ప్లేయర్స్.. టైటిల్ గెలవాలంటే ఏం చేయాలి?
Champions Trophy: ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేచింది. 2017 ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్.. ఈ సారి మాత్రం కప్పు వదలకూడదనే పట్టుదలతో ఉంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతున్న టీమ్ఇండియా అవకాశాలు ఎలా ఉన్నాయి?

ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడి హిస్టరీ క్రియేట్ చేయాలనే లక్ష్యం టీమ్ఇండియాది. 2002 (శ్రీలంకతో కలిసి), 2013లో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ సారి టైటిల్ పై కన్నేసింది. సీనియర్, యువ ఆటగాళ్లతో రోహిత్ సేన పటిష్ఠంగానే కనిపిస్తోంది. కానీ అత్యుత్తమ జట్లను దాటి ఛాంపియన్ గా నిలవడం అంత సులువేం కాదు. కప్ చేజిక్కాలంటే టోర్నీ సాంతం నిలకడ కొనసాగించడం ముఖ్యం.
బ్యాటింగ్ అదుర్స్
టీమ్ఇండియా బ్యాటింగ్ కు తిరుగేలేదు. కెప్టెన్ రోహిత్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగా ఉంది. ఇటీవల ఇంగ్లండ్ తో సిరీస్ లో సెంచరీతో రోహిత్, హాఫ్ సెంచరీతో కోహ్లి ఫామ్ అందుకున్నారు. ఇక శుభ్ మన్, శ్రేయస్ నిలకడగా పరుగులు సాధిస్తున్నారు. గత మూడు మ్యాచ్ ల్లో శ్రేయస్ వరుసగా 59, 44, 78 పరుగులు చేశాడు. గిల్ ఏమో ఓ సెంచరీ, రెండు అర్ధసెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.
ఆల్ రౌండర్ల అండ
భారత క్రికెట్ జట్టుకు తగినంత ఆల్ రౌండర్ల అండ ఉంది. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అటు బంతితో, ఇటు బ్యాట్ తో సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ ఆటగాళ్లందరూ మంచి రిథమ్ తో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. దుబాయ్ లోని స్లో పిచ్ లపై జడేజా, అక్షర్, సుందర్ జట్టుకు కీలకమయ్యే అవకాశముంది.
అదొక్కటే లోటు
ఛాంపియన్స్ ట్రోఫీ దిశగా భారత జట్టుకు బుమ్రా దూరమవడం ఒక్కటే లోటు. అతను లేకపోవడంతో జట్టు విక్టరీ ఛాన్సెస్ 30 శాతం తగ్గాయనే వ్యాఖ్యలు వస్తుండటం బుమ్రా విలువను చాటుతోంది. సీనియర్ పేసర్ షమి ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. యువ పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్ అంచనాలను అందుకోవాల్సి ఉంటుంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్ దీప్, వరుణ్ చక్రవర్తి కూడా జట్టును మరింత బలోపేతం చేస్తున్నారు.
కప్ దక్కాలంటే
బంగ్లాదేశ్ తో మ్యాచ్ తో గురువారం (ఫిబ్రవరి 20) టైటిల్ వేటను భారత్ మొదలెట్టనుంది. ఆ తర్వాత ఆదివారం (ఫిబ్రవరి 23)న పాకిస్థాన్ తో మ్యాచ్ భారత్ కు ఎంతో కీలకం. దాయాదిపై గెలిస్తే టైటిల్ దిశగా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సాగొచ్చు. భారత్ గ్రూప్ దశను తేలిగ్గానే దాటే అవకాశముంది. ఆ తర్వాత నాకౌట్లోనూ బలమైన జట్లను దాటేలా నిలకడ కొనసాగించాలి. సీనియర్లు రోహిత్, కోహ్లి గైడెన్స్ లో జట్టు సమష్టిగా రాణిస్తే కప్ ఖాయమే.
సంబంధిత కథనం