Teamindia: ఆటోలో భారత ఆటగాళ్లు.. పూరీ జగన్నాథుని సన్నిధిలో క్రికెటర్లు.. ఇంగ్లండ్ తో రెండో వన్డేకు సై
Teamindia: ఇంగ్లండ్ తో రెండో వన్డేకు సిద్ధమవుతున్న భారత ఆటగాళ్లు కాసేపు దైవ సన్నిధిలో సమయం గడిపారు. ఇండియా క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఆటోలో ప్రయాణించి పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.

జగన్నాథుని సన్నిధిలో క్రికెటర్లు
భారత క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు. కటక్ లోని బారాబతి స్టేడియంలో రెండో వన్డే కోసం భువనేశ్వర్ చేరుకున్న ఆటగాళ్లు శనివారం (ఫిబ్రవరి 8) ఈ దేవాలయాన్ని సందర్శించారు. భక్తి భావంలో మునిగిపోయారు.
ఆటోలో ప్రయాణించి
ఈ ముగ్గురు టీమ్ఇండియా స్పిన్నర్లు దైవ దర్శనానికి ముందు శ్రీమందిర్ కు ఈ- ఆటోలో ప్రయాణించారు. పూరీ పోలీసు అధికారులు వీళ్లకు భద్రత కల్పించగా.. వరుణ్, అక్షర్, సుందర్ ఆటోలో ప్రయాణించి ఆలయం చేరుకున్నారు. వీళ్ల దర్శనం కోసం ముందే అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూశారు. దర్శనం తర్వాత పూరీ ఆలయ అధికారులు వరుణ్, అక్షర్, సుందర్ ను పవిత్ర వస్త్రంతో ఆశీర్వదించారు.
సుందర్ ఆనందం
పూరీ జగన్నాథున్ని దర్శించుకోవడం పట్ల టీమ్ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘దర్శనం చాలా చాలా బాగా జరిగింది. ధన్యవాదాలు’’ అని సుందర్ తెలిపాడు. కటక్ లో రెండో వన్డే కోసం ఇప్పటికే ఇంగ్లండ్, భారత జట్లు ఇక్కడికి చేరుకున్నాయి. ఆదివారం (ఫిబ్రవరి 9) ఈ మ్యాచ్ జరుగుతుంది. శనివారం సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుతురులో భారత జట్టు ప్రాక్టీస్ చేయనుంది.
టీమ్ఇండియా ఆరంభం ఘనంగా
ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. నాగ్ పుర్ లో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. బౌలింగ్ లో రవీంద్ర జడేజా (3/26), హర్షిత్ రాణా (3/53).. బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టును గెలిపించారు.