Rohit Sharma Duck: డకౌట్‌తో రోహిత్ శర్మ చెత్త రికార్డ్, వరుసగా రెండోసారి బోల్తా కొట్టించిన న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ
IND vs NZ 2nd Test Day 1: రోహిత్ శర్మ తొలి టెస్టు తరహాలోనే రెండో టెస్టులోనూ టిమ్ సౌథీకి వికెట్ సమర్పించుకున్నాడు. 9 బంతులాడిన రోహిత్ కనీసం ఖాతా కూడా ఈరోజు తెరవలేకపోయాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండో టెస్టులోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 259 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన భారత్ జట్టు ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది.
సచిన్ రికార్డ్ సరసన రోహిత్
తొలి ఇన్నింగ్స్‌లో 9 బంతులాడిన రోహిత్ శర్మ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఆఫ్ స్టంప్ లైన్‌పై బంతి న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ విసిరిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇదే సిరీస్‌లో బెంగళూరు వేదికగా ఇటీవల జరిగిన తొలి టెస్టులోనూ మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మని టిమ్ సౌథీ ఔట్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌటైన రికార్డుల్లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ని రోహిత్ శర్మ గురువారం సమం చేశాడు. సచిన్ తన సుదీర్ఘ కెరీర్‌లో 34 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కి చేరగా.. ఈరోజు రోహిత్ శర్మ కూడా కెరీర్‌లో 34వ సారి డకౌట్ అయ్యాడు.
చెత్త రికార్డ్‌లో కోహ్లీ కూడా
భారత్ తరఫున అత్యధిక సార్లు సున్నాకే ఔటైన ఆటగాళ్ల జాబితాలో మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ టాప్‌లో ఉన్నాడు. జహీర్ ఖాన్ తన కెరీర్‌లో ఏకంగా 43 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత స్థానంలో ఇషాంత్ శర్మ 40 డకౌట్లతో ఉండగా.. అనూహ్యంగా విరాట్ కోహ్లీ మూడో స్థానంలో 38 డకౌట్లతో కొనసాగుతున్నాడు. ఇక నాలుగో స్థానంలో హర్భజన్ సింగ్ 37 డకౌట్స్‌తో, అనిల్ కుంబ్లే 35 డకౌట్స్‌తో టాప్-5లో కొనసాగుతున్నారు.
14 సార్లు బుట్టలో వేసిన సౌథీ
అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మను న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ ఔట్ చేయడం ఇది 14వ సారి. టిమ్ సౌథీతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కగిసో రబాడ మాత్రమే రోహిత్‌ను 14 సార్లు ఔట్ చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో ఏంజెలో మాథ్యూస్ (10), నాథన్ లియాన్ (9), ట్రెంట్ బౌల్డ్ (8) టాప్-5లో కొనసాగుతున్నారు.
రోహిత్ శర్మ వన్డే, టీ20ల్లో ఎక్కువగా స్పిన్నర్ల బౌలింగ్‌లో ఔట్ అవుతూ ఉంటాడు. మరీ ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆడటంలో రోహిత్ శర్మ కాస్త ఇబ్బంది పడతాడు. అయితే.. టెస్టుల్లో ఇలా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీకి వరుసగా రెండు టెస్టుల్లో వికెట్ సమర్పించుకోవడం టీమిండియాను కలవరపరిచే అంశం.