IND vs AUS: సమిష్టిగా అదరగొట్టిన భారత్.. ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో గెలుపు.. నలుగురు అర్ధ శతకాలు
IND vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. సమిష్టిగా సత్తాచాటి సిరీస్‍లో బోణీ చేసింది.
IND vs AUS: టీమిండియా మరోసారి సత్తాచాటింది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో సమిష్టిగా రాణించిన భారత్ ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకున్నా యువ టీమిండియా అదరగొట్టింది. మొహాలీ వేదికగా నేడు (సెప్టెంబర్ 22) జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఆసీస్‍పై గెలిచింది. 277 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (71), శుభ్‍మన్ గిల్ (74), కెప్టెన్ కేఎల్ రాహుల్ (58 నాటౌట్), సూర్య కుమార్ యాదవ్ (50) అర్ధ శతకాలతో అదరగొట్టారు. దీంతో 48.4 ఓవర్లలో 5 వికెట్లకు 281 పరుగులు చేసి విజయం సాధించింది టీమిండియా. చివర్లో విన్నింగ్ సిక్స్ కొట్టాడు కేఎల్ రాహుల్. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా రెండు, అబాట్, కమిన్స్ చెరో వికెట్ తీసుకున్నారు. తొలి మ్యాచ్‍లో ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‍లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్ మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో దుమ్మురేపాడు. బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. మ్యాచ్ ఎలా సాగిందంటే..
గిల్, గైక్వాడ్ అద్భుత ఆరంభం
లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు శుభ్‍మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలను దీటుగా ఎదుర్కొంటూ ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ముందుకు సాగారు. ఆరంభంలో గిల్ దూకుడుగా ఆడితే.. గైక్వాడ్ సహకరించాడు. ఆ తర్వాత ఇద్దరూ అదరగొట్టారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీల మోత మోగించారు. దీంతో 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 66 పరుగులు చేసింది భారత్. 37 బంతుల్లోనే శుభ్‍మన్ గిల్ అర్ధ శతకం చేశాడు. ఆ తర్వాత 60 బంతుల్లో హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు గైక్వాడ్. ఆ తర్వాత రుతురాజ్ దూకుడు పెంచి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే, 22వ ఓవర్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ జంపా అతడిని ఎల్‍బీడబ్ల్యూ చేశాడు. దీంతో 142 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత గిల్‍ను కూడా జంపా ఔట్ చేశాడు.
కేఎల్ రాహుల్, సూర్య షో
శ్రేయస్ అయ్యర్ (3) రనౌట్ అవడంతో 151 పరుగుల వద్ద మూడో వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడిలో పడింది భారత్. కాసేపు నిలకడగా ఆడిన ఇషాన్ కిషన్ (18) కూడా పెవిలియన్ చేరాడు. అయితే, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత అదరగొట్టారు. ముఖ్యంగా సూర్య తన స్టైల్‍కు భిన్నంగా ఆడాడు. సంప్రదాయ షాట్లతోనే పరుగులు రాబట్టాడు. కేఎల్ రాహుల్ మరోవైపు అతడికి సహకరించాడు. దీంతో 35.5 ఓవర్లలో 200 పరుగులు.. 44 ఓవర్లలో 250 పరుగులకు చేరి టీమిండియా గెలుపు దిశగా సాగింది. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ 47 బంతుల్లో అర్ధ శకతం చేసి.. ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ చివరి వరకు నిలిచి.. విన్నింగ్ సిక్సర్ కొట్టి మ్యాచ్‍ను గెలిపించాడు.
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది ఆస్ట్రేలియా. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52), జోష్ ఇన్‍గ్లిస్ (45), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. దీంతో 50 ఓవర్లలో 276 పరుగులు చేయగలిగింది ఆసీస్. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఆదివారం (సెప్టెంబర్ 24) ఇండోర్ వేదికగా జరగనుంది.
సంబంధిత కథనం