Ind W vs SA W: స్మృతి మంధాన సెంచరీ.. శోభన 4 వికెట్లు.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఇండియా
Ind W vs SA W: స్మృతి మంధానా సెంచరీ, శోభనా 4 వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఇండియా వుమెన్ టీమ్ గెలిచింది. దీంతో సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Ind W vs SA W: ఓపెనర్ స్మృతి మంధానా వన్డేల్లో ఆరో సెంచరీ చేయడంతో సౌతాఫ్రికా వుమెన్ పై ఇండియా వుమెన్ ఏకంగా 143 పరుగుల తేడాతో విజయం సాధించింది. మంధానా సెంచరీకితోడు తొలి మ్యాచ్ ఆడిన శోభన 4 వికెట్లు తీయడం విశేషం. ఈ మ్యాచ్ లో ఇండియా 265 రన్స్ చేయగా.. సౌతాఫ్రికా కేవలం 122 పరుగులకే కుప్పకూలింది.
స్మృతి మంధానా సెంచరీ
ఇండియా వుమెన్ టీమ్ ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసింది. ఒక దశలో కేవలం 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ స్మృతి మంధానా మాత్రం క్రీజులో నిలదొక్కుకొని ఇండియా ఫైటింగ్ స్కోరు సాధించేలా చేసింది. మంధానా 127 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ తో 117 రన్స్ చేసింది. దీంతో ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 రన్స్ చేసింది.
దీప్తి శర్మ (37)తో కలిసి ఆరో వికెట్ కు 81 పరుగులు, పూజ వస్త్రకర్ (31)తోకలిసి ఏడో వికెట్ కు 58 పరుగులు జోడించింది స్మృతి మంధానా. దీంతో ఇండియా వుమెన్ టీమ్ మంచి స్కోరు సాధించింది. వన్డేల్లో ఆరో సెంచరీ చేసిన స్మృతి 47వ ఓవర్లో ఔటైంది. ఇదే మ్యాచ్ లో ఆమె అంతర్జాతీయ క్రికెట్ లో 7 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకుంది.
ఈ మ్యాచ్ లో తన వ్యక్తిగత స్కోరు 59 పరుగులు చేరుకున్నప్పుడు స్మృతి ఈ మార్క్ చేరుకుంది. మిథాలీ రాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ వుమన్ క్రికెటర్ గా స్మృతి నిలిచింది. అంతేకాదు ఐదు సెంచరీలతో ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ ను కూడా ఆరో సెంచరీతో ఆమె వెనక్కి నెట్టింది. ఇక తన సొంత మైదానం బెంగళూరులో స్మృతి తొలి సెంచరీ చేయడం విశేషం.
కుప్పకూలిన సౌతాఫ్రికా
తర్వాత చేజింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా ఏ దశలో లక్ష్యం వైపు వెళ్తున్నట్లుగా కనిపించలేదు. 37.4 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. ఇండియా తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న శోభన 4 వికెట్లతో చెలరేగింది. ఆమె 8.4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకుంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సూనె లూస్ మాత్రమే 33 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.
సినాలో జాఫ్టా (27), మారిజాన్ కాప్ (24) తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా నిలిచారు. శోభన కాకుండా ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు, రేణుక, పూజా, రాధా యాదవ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఇండియన్ వుమెన్ టీమ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.