Ind W vs SA W 1st T20: సౌతాఫ్రికా వుమెన్‌తో తొలి టీ20లో పోరాడి ఓడిన ఇండియా వుమెన్స్ టీమ్
Ind W vs SA W 1st T20: సౌతాఫ్రికా వుమెన్ టీమ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఇండియా వుమెన్ టీమ్ పోరాడి ఓడింది. జెమీమా, హర్మన్‌ప్రీత్ పోరాడినా.. చివరికి 12 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.
Ind W vs SA W 1st T20: ఇండియా పర్యటనలో సౌతాఫ్రికా వుమెన్ టీమ్ తొలి విజయం నమోదు చేసింది. మొదట వన్డే సిరీస్, తర్వాత ఏకైక టెస్టులో ఓడిపోయిన ఆ టీమ్.. మొత్తానికి తొలి టీ20లోనే ఇండియన్ వుమెన్ టీమ్ ను ఓడించింది. చివరి వరకు పోరాడినా.. 12 పరుగుల తేడాతో ఇండియాకు ఓటమి తప్పలేదు. జెమీమా, హర్మన్‌ప్రీత్ పోరాటం వృథా అయింది.

సౌతాఫ్రికా వుమెన్ టీమ్ విజయం
ఈ మ్యాచ్ లో 190 పరుగులు లక్ష్యంతో ఇండియన్ వుమెన్స్ టీమ్ బరిలోకి దిగింది. అయితే చివరికి 20 ఓవర్లలో 4 వికెట్లకు 177 రన్స్ మాత్రమే చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 30 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్స్ తో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా 29 బంతుల్లో 35 రన్స్ చేసింది. చివరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగారు.
ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 90 పరుగులు జోడించినా.. జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. అంతకుముందు ఓపెనర్ స్మృతి మంధానా 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 46 రన్స్ చేసింది. షెఫాలీ 18, హేమలత 14 రన్స్ చేసి ఔటయ్యారు. ఒక దశలో 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. జెమీమా, హర్మన్ ఇన్నింగ్స్ ను మళ్లీ గాడిలో పెట్టి గెలిపించేలా కనిపించినా.. ఓటమి తప్పలేదు.
ఈ విజయంతో సౌతాఫ్రికా వుమెన్ టీమ్ 3 టీ20ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు ఆ టీమ్ మూడు వన్డేల సిరీస్ లో అన్ని మ్యాచ్ లూ ఓడిపోయింది. తర్వాత ఏకైక టెస్టులోనూ ఇండియన్ టీమ్ 10 వికెట్లతో గెలిచింది. దీంతో ఈ పర్యటనలో సౌతాఫ్రికా వుమెన్స్ టీమ్ తొలి విజయం సాధించినట్లయింది.
చెలరేగిన బ్రిట్స్
అంతకుముందు తొలి టీ20లో టాస్ ఓడి సౌతాఫ్రికా వుమెన్ టీమ్ బ్యాటింగ్ చేసింది. ఆ టీమ్ తరఫున ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. 7.1 ఓవర్లలోనే 50 పరుగులు జోడించారు. కెప్టెన్ వోల్వార్ట్ 22 బంతుల్లో 33 రన్స్ చేసి ఔటైంది. అయితే మరో ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ చెలరేగిపోయింది. ఆమె కేవలం 56 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్స్ లతో 81 రన్స్ చేసింది.
మూడో స్థానంలో వచ్చిన మారిజాన్ కాప్ కూడా కేవలం 33 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్స్ తో 57 రన్స్ చేసింది. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 96 రన్స్ జోడించారు. దీంతో సౌతాఫ్రికా వుమెన్స్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇండియా బౌలర్లలో పూజా వస్త్రకర్ మాత్రమే 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకుంది. మిగతా బౌలర్లు నిరాశ పరిచారు.