Ind W vs IRE W: చరిత్ర సృష్టించిన ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్.. ప్రతీకా రావల్, స్మృతి మంధానా సెంచరీల మోత
Ind W vs IRE W: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసింది. ప్రతీకా రావల్, స్మృతి మంధానా సెంచరీల మోత మోగించడంతో ఐర్లాండ్ వుమెన్స్ టీమ్ పై 50 ఓవర్లలో ఏకంగా 5 వికెట్లకు 435 రన్స్ చేసింది.
Ind W vs IRE W: ప్రతీకా రావల్ వన్డేల్లో తన తొలి సెంచరీ చేయగా.. స్మృతి మంధానా కూడా మరో సెంచరీ బాదింది. దీంతో ఐర్లాండ్ వుమెన్స్ టీమ్ తో బుధవారం (జనవరి 15) జరుగుతున్న మూడో, చివరిదైన వన్డే మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్లకు 435 రన్స్ చేసింది. వన్డేల్లో ఇండియన్ వుమెన్స్ టీమ్ కు ఇదే అత్యధిక స్కోరు. రెండు రోజుల కిందట ఇదే ఐర్లాండ్ జట్టుపై 3 వికెట్లకు 370 రన్స్ తో క్రియేట్ చేసిన రికార్డును తిరగరాసింది.
ఇండియన్ వుమెన్స్ టీమ్ రికార్డు
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ ఐర్లాండ్ పై రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఓపెనర్లు ప్రతీకా రావల్ 154, స్మృతి మంధానా 135 రన్స్ చేయడంతో వన్డేల్లో తన అత్యధిక స్కోరు చేసింది. ఇండియన్ క్రికెట్ లో పురుషులు, మహిళలు కలిపినా వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు.
మహిళల వన్డేల్లో తొలి మూడు టాప్ స్కోర్లు న్యూజిలాండ్ పేరిటే ఉన్నాయి. ఇక వుమెన్స్ వన్డే చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో 400కుపైగా పరుగులు చేసిన మూడో టీమ్ గా ఇండియా నిలిచింది. గతంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ ఘనత సాధించాయి.
రెచ్చిపోయిన ఓపెనర్లు
ఐర్లాండ్ బౌలర్లపై ఇండియన్ ఓపెనర్లు స్మృతి, ప్రతీకా విరుచుకుపడ్డారు. ఎలాంటి దయ చూపకుండా ఎడాపెడా బాదేశారు. ఈ క్రమంలో ఇండియన్ వుమెన్ టీమ్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసింది. ఆమె కేవలం 70 బంతుల్లోనే మూడంకెల స్కోరు చేయడం విశేషం. 80 బంతుల్లోనే స్మృతి 12 ఫోర్లు, 7 సిక్స్ లతో 135 రన్స్ చేసింది. వన్డేల్లో ఆమెకిది పదో సెంచరీ. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ వుమెన్ ప్లేయర్ గా స్మృతి రికార్డు క్రియేట్ చేసింది.
మెగ్ లానింగ్ (15), సుజీ బేట్స్ (13) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఘనత స్మృతి మంధానాదే. అటు మరో ఓపెనర్ ప్రతీకా రావల్ వన్డేల్లో తొలి సెంచరీ చేసింది. ఆమె 129 బంతుల్లో 154 రన్స్ చేసింది. ప్రతీకా ఇన్నింగ్స్ లో 20 ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి. ఈ ఇద్దరూ తొలి వికెట్ కు ఏకంగా 233 రన్స్ జోడించారు. తన తొలి ఐదు వన్డేల్లో మూడు హాఫ్ సెంచరీలు బాదిన ఆమె.. మొత్తానికి తొలి సెంచరీ చేసింది. 100 బంతుల్లోనే ఆమె తన తొలి మూడంకెల స్కోరు అందుకుంది.
మహిళల క్రికెట్‌లో అత్యధిక స్కోర్లు
మహిళల వన్డేల్లో టాప్ 5 స్కోర్లను ఒకసారి చూస్తే.. ఐర్లాండ్ వుమెన్ పైనే 2018లో న్యూజిలాండ్ వుమెన్ టీమ్ 4 వికెట్లకు 491 రన్స్ చేసింది. ఆ తర్వాత అదే టీమ్ 1997లో పాకిస్థాన్ వుమెన్ టీమ్ పై 5 వికెట్లకు 455 రన్స్, 2018లో ఐర్లాండ్ వుమెన్ పై 3 వికెట్లకు 440 రన్స్ చేసింది.
ఈ మూడింటి తర్వాత ఇప్పుడు ఇండియన్ వుమెన్స్ టీమ్ అదే ఐర్లాండ్ వుమెన్ టీమ్ పై 5 వికెట్లకు 435 రన్స్ చేసింది. నాలుగో స్థానంలో మరోసారి న్యూజిలాండ్ టీమే అదే ఐర్లాండ్ వుమెన్ టీమ్ పై 418 రన్స్ చేసింది. ఇక 1997లో ఆస్ట్రేలియా వుమెన్ టీమ్ డెన్మార్క్ పై 3 వికెట్లకు 412 రన్స్ చేసింది.