India Champions Trophy: పీడీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఇండియా.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం
India Champions Trophy: ఇండియా ఫిజికల్ డిజబిలిటీ క్రికెట్ టీమ్ పీడీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ ను 79 పరుగుల తేడాతో చిత్తు చేసి ట్రోఫీ అందుకోవడం విశేషం.
India Champions Trophy: ఫిజికల్ డిజబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది ఇండియన్ ఫిజికల్ డిజబిలిటీ క్రికెట్ టీమ్. మంగళవారం (జనవరి 21) శ్రీలంకలోని కటునాయకెలో ఉన్న ఎఫ్‌టీజెడ్ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగిన ఫైనల్లో 79 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. ఈ విషయాన్ని డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.
పీడీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఇండియా
ఫిజికల్ డిజబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన ఇండియన్ టీమ్.. ఫైనల్లోనూ అదే ఊపు కొనసాగించింది. ఇండియన్ టీమ్ ను కెప్టెన్ విక్రాంత్ కేని ముందుండి నడిపించాడు. "చారిత్రక విజయం. టీమిండియా 79 పరుగులతో ఇంగ్లండ్ ను చిత్తు చేసి పీడీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గెలుచుకుంది. టీమ్ వర్క్, సంకల్పం, ప్రతిభ కలగలసిన విజయమిది" అంటూ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 రన్స్ చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ కేవలం 118 పరుగులకే కుప్పకూలింది. తన కెరీర్లో పీడీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం అతిగొప్ప ఘనత అని మ్యాచ్ గెలిచిన తర్వాత కెప్టెన్ విక్రాంత్ కేనీ అన్నాడు. ఈ చారిత్రక విజయంలో ప్రతి ప్లేయర్ తన వంతు పాత్ర పోషించాడని చెప్పాడు.
ఫైనల్లో మెరిసిన యోగేంద్ర
పీడీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియన్ టీమ్ తరఫున యోగేంద్ర భదోరియా అద్భుతంగా రాణించాడు. అతడు కేవలం 40 బంతుల్లోనే 73 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఐదు సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీంతో ఇండియా భారీ స్కోరు చేయగలిగింది. అటు బౌలింగ్ లో రాధికా ప్రసాద్ రాణించాడు. అతడు 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
కెప్టెన్ విక్రాంత్, రవీంద్ర సాంటే కూడా రెండేసి వికెట్లు తీసుకున్నారు. దీంతో ఇంగ్లండ్ 118 పరుగులకే ఆలౌటైంది. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన ఇండియన్ టీమ్ పై హెడ్ కోచ్ రోహిత్ జలానీ ప్రశంసలు కురిపించాడు. ఇక ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వచ్చే నెలలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్, దుబాయ్ లలో జరగనుంది.
సంబంధిత కథనం