India vs South Africa 2nd Test: చుక్కలు చూపించిన సిరాజ్.. 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా
India vs South Africa 2nd Test: సౌతాఫ్రికాకు చుక్కలు చూపించాడు టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్. నిప్పులు చెరిగే బౌలింగ్ తో చెలరేగడంతో రెండో టెస్ట్ తొలి రోజు తొలి సెషన్ లో సఫారీలు ఆలౌటయ్యారు.
India vs South Africa 2nd Test: టీమిండియాపై తొలి టెస్ట్ గెలిచి ఎంతో కాన్ఫిడెంట్ గా రెండో టెస్టులో అడుగుపెట్టిన సౌతాఫ్రికాకు దిమ్మదిరిగే షాకిచ్చాడు పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్. అతనికితోడు బుమ్రా, ముకేశ్ కూడా చెలరేగడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా లంచ్ లోపే 55 పరుగులకే ఆలౌటైంది. కేప్‌టౌన్ లో ఇది మూడో అత్యల్ప స్కోరు.
సిరాజ్ ఆరు వికెట్లు తీసుకోగా.. బుమ్రా, ముకేశ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్లో మార్‌క్రమ్(2) ను ఔట్ చేసి వికెట్ల ఖాతా మొదలు పెట్టాడు సిరాజ్. తర్వాత ఎల్గార్ (4), జోర్జీ (2), బెడింగామ్ (12), వెరీన్ (15), మార్కో యాన్సెన్ (0) వికెట్లు కూడా తీశాడు.
సిరాజ్ 9 ఓవర్లలో కేవలం 15 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీయడం విశేషం. టెస్ట్ క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో ఐదు అంతకన్నా ఎక్కువ వికెట్లు తీయడం సిరాజ్ కు ఇది మూడోసారి. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ లో వెరీన్ మాత్రమే 15 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేవలం 23.2 ఓవర్లలోనే సౌతాఫ్రికా బ్యాటర్లు చాప చుట్టేశారు.
తొలి రోజు లంచ్ లోపే హోమ్ టీమ్ ను ఆలౌట్ చేసి రెండో టెస్టుకు సంచలన ఆరంభాన్ని ఇచ్చింది టీమిండియా. సిరీస్ కోల్పోకూడదంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన ఇండియన్ టీమ్ కు.. ఇది నిజంగా అద్భుతమైన ఆరంభమే.
పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తున్న కేప్‌టౌన్ పిచ్ పై మొదటి నుంచీ టీమిండియా పేస్ బౌలర్లు చెలరేగారు. సౌతాఫ్రికా జట్టుకు ఇండియాపై ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. గతంలో న్యూజిలాండ్ (62) పేరిట ఉన్న రికార్డు ఇప్పుడు సౌతాఫ్రికా వశమైంది. తొలి టెస్టులో మూడు రోజుల్లోనే ఘోర పరాజయం పాలైన ఇండియన్ టీమ్ కు దెబ్బకు దెబ్బ తీయడానికి ఇదే సరైన సమయం. మరి పటిష్ఠమైన ఫాస్ట్ బౌలింగ్ ఉన్న సౌతాఫ్రికాపై మన బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి.