IND vs SA 2nd Test Preview: గెలిస్తేనే సమం: దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టెస్టు: టైమ్, లైవ్, పిచ్, తుది జట్ల వివరాలివే-india vs south africa 2nd test preview timings live streaming and other match details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sa 2nd Test Preview: గెలిస్తేనే సమం: దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టెస్టు: టైమ్, లైవ్, పిచ్, తుది జట్ల వివరాలివే

IND vs SA 2nd Test Preview: గెలిస్తేనే సమం: దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టెస్టు: టైమ్, లైవ్, పిచ్, తుది జట్ల వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 02, 2024 09:10 PM IST

IND vs SA 2nd Test Preview: భారత్, దక్షిణాఫ్రికా జట్లు రెండో టెస్టుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఈ సిరీస్‍ను టీమిండియా సమం చేసుకోగలుగుతుంది. ఈ టెస్టు వివరాలు ఇక్కడ చూడండి.

IND vs SA 2nd Test Preview: గెలిస్తేనే సమం: దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టెస్టు
IND vs SA 2nd Test Preview: గెలిస్తేనే సమం: దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టెస్టు (PTI)

IND vs SA 2nd Test Preview: దక్షిణాఫ్రికా పర్యటనలో ఆఖరి ఆటకు టీమిండియా రెడీ అయింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం (జనవరి 3) రెండో టెస్టు మొదలుకానుంది. రెండు టెస్టుల సిరీస్‍లో ఇప్పటికే తొలి మ్యాచ్‍లో ఘోరంగా ఓడి 0-1తో భారత్ వెనుకబడింది. సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని మరోసారి మిస్ చేసుకుంది. ఈ రెండో టెస్టులో గెలిస్తేనే సిరీస్‍ను భారత్ సమం చేసుకోగలుగుతుంది. టీమిండియా, సఫారీ జట్టు మధ్య బుధవారం నుంచి కేప్‍టౌన్‍లో రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ టైమింగ్స్, లైవ్, తుది జట్లు ఎలా ఉండున్నాయనే వివరాలు ఇక్కడ చూడండి.

టైమ్, వేదిక

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు బుధవారం (జనవరి 3) మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఆట మొదలుకానుంది. కేప్‍టౌన్‍లోని న్యూల్యాండ్స్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

లైవ్ వివరాలు

India vs South Africa: టీమిండియా, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిజిటల్ విషయానికి వస్తే.. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

పిచ్, వాతావరణం

కేప్‍టౌన్‍లో జరిగే ఈ మ్యాచ్‍పై వర్షం ప్రభావం ఉండే అవకాశం చాలా తక్కువ. రెండో టెస్టు జరిగే ఐదు రోజులు ఆటకు వాన ఆటంకం కలిగించకపోచ్చు. ఇక, భారత్, దక్షిణాఫ్రికా తలపడే కేప్‍టౌన్ పిచ్ పేసర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. పిచ్‍పై పచ్చిక ఉంది. చివరి రెండు రోజులు స్పిన్నర్లకు కూడా మద్దతు లభిస్తుంది.

తుది జట్లు ఇలా..

భారత స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా పూర్తి ఫిట్‍నెస్ సాధించాడు. దీంతో రెండో టెస్టు తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో జడేజా వచ్చేయనున్నాడు. తొలి టెస్టులో విఫలమైన యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను భారత మేనేజ్‍మెంట్ కొనసాగిస్తుందా.. లేకపోతే ముకేశ్ కుమార్‌కు అవకాశం ఇస్తుందా అనేది చూడాలి. అలాగే గాయం వల్ల ఈ మ్యాచ్‍కు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా దూరం కానున్నాడు. డీన్ ఎల్గర్ కెప్టెన్సీ చేయనున్నాడు.

భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ/ముకేశ్ కుమార్

దక్షిణాఫ్రికా తుదిజట్టు (అంచనా): డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రమ్, టోనీ డీ జోర్జీ, కీగన్ పీటర్సన్, జుబైర్ హంజా, డేవిడ్ బెడిన్‍గమ్, కేల్ వెర్రైన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్ / లుంగీ ఎంగ్డీ, కగిసో రబాడ, నాడ్రే బర్గర్

ఈ రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై గెలిస్తే సిరీస్‍ను భారత్ సమం చేసుకోవచ్చు. ఒకవేళ డ్రా అయినా, ఓడినా సఫారీ జట్టుకే ఈ రెండు టెస్టుల సిరీస్ దక్కుతుంది. ఈ మ్యాచ్ గెలవాలంటే సఫారీ పేసర్లు రబాడ, బర్గర్, జాన్సెన్‍ను భారత బ్యాటర్లు దీటుగా ఎదుర్కోవాల్సిందే. ఈ మ్యాచ్‍తోనే దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన ముగియనుంది.