India vs South Africa 2nd Test: చారిత్రక విజయంపై కన్నేసిన టీమిండియా.. టార్గెట్ ఎంతంటే?-india vs south africa 2nd test bumrah fifer put india in winning position ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs South Africa 2nd Test: చారిత్రక విజయంపై కన్నేసిన టీమిండియా.. టార్గెట్ ఎంతంటే?

India vs South Africa 2nd Test: చారిత్రక విజయంపై కన్నేసిన టీమిండియా.. టార్గెట్ ఎంతంటే?

Hari Prasad S HT Telugu
Jan 04, 2024 03:30 PM IST

India vs South Africa 2nd Test: కేప్‌టౌన్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో చారిత్రక విజయంపై టీమిండియా కన్నేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఏడెన్ మార్‌క్రమ్ ఫైటింగ్ సెంచరీ చేసినా.. ఇండియన్ టీమ్ ముందు మాత్రం తక్కువ లక్ష్యమే ఊరిస్తోంది.

రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో సౌతాఫ్రికాను కట్టడి చేసిన బుమ్రా
రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో సౌతాఫ్రికాను కట్టడి చేసిన బుమ్రా (PTI)

India vs South Africa 2nd Test: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయంపై కన్నేసింది. కేప్‌టౌన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ముందు 79 పరుగుల లక్ష్యం ఊరిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్ బుమ్రా 6 వికెట్లు తీశాడు. అయితే మార్‌క్రమ్ (106) సెంచరీతో సఫారీలు కీలకమైన ఆధిక్యం సంపాదించారు.

నిజానికి కేప్‌టౌన్ లోని న్యూలాండ్స్ పిచ్ చూస్తుంటే.. ఈ లక్ష్యం కూడా అంత సులువుగా ఏమీ కనిపించడం లేదు. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. టీమిండియా కాస్త జాగ్రత్తగా ఆడితే.. రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగించడంతోపాటు కేప్‌టౌన్ లో తొలి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 55 పరుగులకే, ఇండియా 153 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

రెండో రోజూ పేస్ పరీక్షే..

తొలిరోజే 23 వికెట్లతో రెండు జట్ల బ్యాటర్లకు పేస్ పరీక్ష పెట్టిన కేప్‌టౌన్ లోని న్యూలాండ్స్ పిచ్.. రెండో రోజు కూడా అలాగే వ్యవహరించింది. 3 వికెట్లకు 62 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో సౌతాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. తొలి రోజు పెద్దగా ప్రభావం చూపని బుమ్రా.. రెండో రోజు చెలరేగిపోయాడు. మొదటి ఓవర్లోనే వికెట్ తీశాడు. ఓవర్ నైట్ బ్యాటర్ డేవిడ్ బెడింగామ్ (11) వికెట్ కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

దీంతో 66 పరుగుల దగ్గర సౌతాఫ్రికా 4వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్కోరు 85 పరుగుల దగ్గర ఉన్నప్పుడు బుమ్రా మరో వికెట్ తీశాడు. ఈసారి వికెట్ కీపర్ వెరీన్ (9) సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత స్కోరు 103 పరుగుల దగ్గర బుమ్రానే తన బౌలింగ్ లో యాన్సెన్ (11) ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్ పట్టుకొని సౌతాఫ్రికాను మరింత దెబ్బ తీశాడు.

దీంతో 103 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి సఫారీలు కష్టాల్లో పడ్డారు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. ఓపెనర్ ఏడెన్ మార్‌క్రమ్ మాత్రం వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. మొదట హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఇండియన్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఒకే ఓవర్లో 20 పరుగులు రాబట్టాడు. దీంతో సౌతాఫ్రికా ఆధిక్యం క్రమంగా పెరుగుతూ వచ్చింది.

చివరికి 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 రన్స్ చేసిన మార్‌క్రమ్ ను సిరాజ్ ఔట్ చేయడంతో ఇండియన్ టీమ్ ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు మార్‌క్రమ్ ఇచ్చిన ఓ సింపుల్ క్యాచ్ ను రాహుల్ జారవిడవడం టీమిండియా కొంప ముంచింది. ఈ లైఫ్ దొరికిన తర్వాతే మార్‌క్రమ్ మరింత చెలరేగుతూ వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో సౌతాఫ్రికాకు 78 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది.