IND vs SA 1st T20 Turning Point: ఆరు ఓవర్లు టెన్షన్ పెట్టినా.. జస్ట్ 3 బంతుల్లో భారత్ వైపు తిరిగిన మ్యాచ్
IND vs SA 1st T20 Match Highlights: భారత్ జట్టు 202 పరుగుల భారీ స్కోరు చేసినా.. అయినా దక్షిణాఫ్రికా హిట్టర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ కాసేపు టెన్షన్ పెట్టేశారు. అయితే.. తెలివిగా మిస్టరీ స్పిన్నర్‌ని ప్రయోగించిన సూర్యకుమార్ యాదవ్ ఫలితం రాబట్టాడు.
దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్‌లో భారత్ బోణి అదిరిపోయింది. డర్బన్ వేదికగా శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగలోనూ అదరగొట్టేసిన టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా టీమ్ 17.5 ఓవర్లలోనే 141 పరుగులకి ఆలౌటైంది. దాంతో నాలుగు టీ20ల ఈ సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 మ్యాచ్ ఆదివారం రాత్రి 7.30 గంటలకి ఎస్‌టీ జార్జ్‌స్ పార్క్ వేదికగా జరగనుంది.
ఫస్ట్ బాల్ నుంచే బాదుడు
వాస్తవానికి 202 పరుగుల భారీ స్కోరు బోర్డుపై ఉన్నా దక్షిణాఫ్రికా టీమ్ బెదరలేదు. ఛేదన ఆరంభం నుంచి టీమిండియాపై ఎదురు దాడి చేసింది. ఎంతలా అంటే.. ఫస్ట్ ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో తొలి రెండు బంతుల్నీ దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆడెన్ మార్‌క్రమ్ బౌండరీకి తరలించి తమ ఉద్దేశాన్ని చాటాడు. ఆ తర్వాత కూడా దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదే దూకుడిని ఆలౌట్ అయ్యే వరకూ కొనసాగించారు. ఆ జట్టులో ఏడుగురు ప్లేయర్లు కనీసం ఒక్క సిక్స్ అయినా కొట్టారంటే అర్థం చేసుకోవచ్చు.
హిట్టర్ల దెబ్బకి భారత్ బౌలర్లు హడల్
దక్షిణాఫ్రికా జట్టు దూకుడుగా ఆడే ప్రయత్నంలో వరుసగా వికెట్లు చేజార్చుకుంటూ వచ్చింది. దాంతో ఒకానొక దశలో ఆ జట్టు 44/3తో నిలవగా.. ఆ సమయంలో క్రీజులో నిలిచిన హెన్రిచ్ క్లాసెన్ (25: 22 బంతుల్లో 2X4, 1X6), డేవిడ్ మిల్లర్ (18: 22 బంతుల్లో 1x4, 1x6) ఓ 6 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకుని నెమ్మదిగా గేర్ మారుస్తూ కనిపించారు. దాంతో భారత్ జట్టులోనూ టెన్షన్ మొదలైంది. హన్రిచ్ క్లాసెన్ నిల్చొన్న చోటు నుంచే అలవోకగా భారీ షాట్స్ ఆడుతూ కనిపించాడు. దాంతో దక్షిణాఫ్రికా టీమ్‌లోనూ గెలుపుపై ఆశలు చిగురించాయి.
అస్త్రం దింపిన టీమిండియా కెప్టెన్
హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌లో కనీసం ఒక్కరు ఆఖరి వరకూ క్రీజులో ఉన్నా.. మ్యాచ్‌ను వదులుకోవాల్సిన ప్రమాదం గ్రహించిన సూర్యకుమార్ యాదవ్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ వరుణ్ చక్రవర్తి.. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో మ్యాజిక్ చేశాడు. 3 బంతుల వ్యవధిలో క్లాసెన్, మిల్లర్‌ను ఔట్ చేసేశాడు. దాంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్ వైపు తిరిగింది. ఇద్దరూ వరుణ్ చక్రవర్తి ఊరిస్తూ విసిరిన బంతికి భారీ షాట్ ఆడబోయి వికెట్ చేజార్చుకోవడం గమనార్హం.
సమష్టిగా రాణించిన భారత్ బౌలర్లు
మ్యాచ్‌లో ఓవరాల్‌గా భారత్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్ రెండు, అర్షదీప్ సింగ్ ఒక వికెట్ పడగొట్టాడు. గెరాల్డ్‌ను ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ రనౌట్ చేశాడు.
సంజు మెరిసినా.. లాస్ట్ ఫట్
అంతకముందు సంజు శాంసన్ 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. దాంతో భారత్ జట్టు 200పైచిలుకు స్కోరు చేయగలిగింది. వాస్తవానికి ఇంకా 20-30 పరుగులు డెత్ ఓవర్లలో చేసి ఉండొచ్చు. కానీ.. రింకు సింగ్, అక్షర్ పటేల్ చివర్లో వరుసగా ఔట్ అయిపోవడంతో 202 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.