IND vs SA 1st Odi:కోహ్లి, రోహిత్ లేకుండానే సఫారీలతో నేడు టీమిండియా తొలి వన్డే పోరు - సంజూ శాంసన్‌కు స్థానం దక్కేనా?
IND vs SA 1st Odi: ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఆదివారం (నేడు) తొలి వన్డే జరుగనుంది. కోహ్లి, రోహిత్ లేకుండానే కేఎల్ రాహుల్ నాయకత్వంలో యంగ్ టీమ్ ఇండియా సఫారీలతో పోరుకు సిద్ధమైంది.
IND vs SA 1st Odi: ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఆదివారం (నేటి) నుంచి వన్డే సమరం మొదలుకానుంది. టీ20 సిరీస్ సమం చేసిన టీమిండియా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. సీనియర్లు రోహిత్ వర్మ, విరాట్ కోహ్లి లేకుండానే కేఎల్ రాహుల్ నాయకత్వంలో సౌతాఫ్రికాతో పోరుకు టీమిండియా సిద్ధమైంది. యంగ్ ప్లేయర్లతో నిండిన టీమిండియా జట్టులో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌తో పాటు సంజూ శాంసన్ మాత్రమే సీనియర్లు. బ్యాటింగ్ భారం ఎక్కువగా ఈ ముగ్గురిపైనే ఉంది.

సౌతాఫ్రికా సిరీస్‌తోనే ఐపీఎల్ స్టార్ ప్లేయర్లు రజత్ పాటిదార్, సాయిసుదర్శన్ వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వన్డేల్లో వీరి మెరుపులు ఎలా ఉండబోతున్నాయన్నది చూడాల్సిందే.
జ్వరం కారణంగా ఆదివారం జరుగనున్న తొలి వన్డేకు రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు. టీ20 సిరీస్‌లో విఫలమైన తిలక్ వర్మకు వన్డేలో చోటు దక్కడం అనుమానమే. సంజూ శాంసన్ నుంచి అతడికి పోటీ ఉంది. సంజూ శాంసన్,తిలక్ వర్మలలో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
సౌతాఫ్రికాకు ఉన్న స్పిన్ బలహీనతను దృష్టిలో పెట్టుకొని కుల్దీప్ యాదవ్‌తో పాటు అక్షర్ పటేల్ ఇద్దరిని తుది జట్టులోకి తీసుకోవాలనే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది. ఇద్దరు పేసర్లతోనే టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సౌతాఫ్రికా కూడా మాజీ కెప్టెన్ బవూమా, రబాడాలను పక్కనపెట్టి కొత్త ముఖాలను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. టోనీ జార్జీ, నండ్రే బర్గర్ టీమిండియాతో మ్యాచ్ ద్వారా సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జోహన్నస్‌బర్త్ వేదికగా మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది.