భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎదురు చూసే క్రికెట్ ఫ్యాన్స్ కు బంపరాఫర్ లాంటి వార్త ఇది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ చిరకాల ప్రత్యర్థులు ఒక్కసారి తలపడితేనే క్రికెట్ ప్రపంచం ఊగిపోయింది. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు ఒకే టోర్నీలో ఈ దాయాది జట్లు తలపడితే మామూలుగా ఉండదు. ఈ ఏడాది ఆసియా కప్ లో అదే జరిగే అవకాశముంది.
ఆసియా ఖండంలోని జట్ల మధ్య పోరుకు వేదికగా నిలిచే ఆసియా కప్ ఈ ఏడాది జరగబోతోంది. క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం వరకు ఆసియా కప్ జరిగే అవకాశం ఉంది. 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఆసియాకప్ ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు.
నిజానికి ఈ ఆసియా కప్ 2025 కు భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ కు భారత్ వెళ్లలేదు. దీంతో ఆసియా కప్ కోసం భారత్ కు పాక్ వచ్చే అవకాశం లేదు. అందుకే ఆసియా కప్ ను తటస్థ వేదికలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్లాన్ చేస్తోందని క్రిక్ బజ్ తెలిపింది. శ్రీలంక లేదా యూఏఈలో ఈ టోర్నీ జరిగే అవకాశముంది. బీసీసీఐనే హోస్ట్ గా ఉంటుంది.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మెగా పోరుపై ఫోకస్ పెట్టిన ఏసీసీ అందుకు తగ్గట్లుగానే షెడ్యూల్ ఖరారు చేయనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ టోర్నీలో ఇండియా, పాక్ గరిష్ఠంగా మూడు సార్లు తలపడే అవకాశముంటుంది. మొదట గ్రూప్ దశలో, ఆ తర్వాత సూపర్-4లో, చివరగా ఫైనల్ చేరితే అక్కడ మరోసారి తలపడే ఛాన్స్ ఉంది.
చివరగా 2023 ఆసియా కప్ లోనూ భారత్, పాక్ మూడు సార్లు తలపడేలా షెడ్యూల్ రూపొందించారు. కానీ గ్రూప్ దశలో ఈ దాయాదుల మ్యాచ్ వర్షంతో రద్దయింది. కానీ సూపర్-4లో పాక్ ను భారత్ చిత్తు చేసింది. పాక్ సెమీస్ లో శ్రీలంక చేతిలో ఓడటంతో ఫైనల్ చేరలేకపోయింది. మరోవైపు టైటిల్ పోరు లో శ్రీలంకను ఓడించి భారత్ విజేతగా నిలిచింది.
సంబంధిత కథనం