India vs Pakistan: పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లరో రాతపూర్వకంగా వివరణ ఇవ్వండి: బీసీసీఐని కోరిన ఐసీసీ
India vs Pakistan: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ కు వెళ్లబోమంటున్న బీసీసీఐని రాతపూర్వక వివరణ అడిగింది ఐసీసీ. వచ్చే ఏడాది పాకిస్థాన్ లో ఈ మెగా టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే.
India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో వివాదం ముదుతున్న వేళ ఐసీసీ రంగంలోకి దిగింది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ కు ఎందుకు వెళ్లరో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని బీసీసీఐని ఐసీసీ కోరినట్లు జియో న్యూస్ రిపోర్టు వెల్లడించింది. ఇప్పటి వరకూ మన బోర్డు ఈ విషయాన్ని మౌఖికంగానే చెబుతూ వస్తోంది.
పాకిస్థాన్‌కు వెళ్లే ప్రసక్తే లేదు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈసారి టోర్నీ ఆతిథ్య హక్కులను ఆ దేశం దక్కించుకున్నప్పటి నుంచీ ఇండియా వెళ్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఊహించినట్లే పాకిస్థాన్ కు జట్టును పంపే ప్రసక్తే లేదని ఐసీసీకి బీసీసీఐ చెబుతూ వస్తోంది.
అయితే దీనిపై రాతపూర్వక వివరణ కావాలని తాజాగా ఐసీసీ డిమాండ్ చేయడం గమనార్హం. ఇండియా వివరణను రాత పూర్వకంగా ఇవ్వాలని పాకిస్థాన్ డిమాండ్ చేయడంతో ఆ మేరకు ఐసీసీ.. బీసీసీఐని అడిగింది. ఒకవేళ రాతపూర్వక సమాధానం వస్తే.. వాళ్లు చెప్పే కారణాలకు తగిన ఆధారాలను పాకిస్థాన్ కోరే అవకాశం ఉన్నట్లు జియో న్యూస్ రిపోర్టు వెల్లడించింది.
ఆ కారణాలను సమీక్షించిన తర్వాత ఇండియా విషయంలో ఐసీసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇండియా సరైన కారణాలను చూపించలేకపోతే మాత్రం పాకిస్థాన్ కు వెళ్లాల్సిందే అని ఐసీసీ కోరనున్నట్లు ఆ రిపోర్టు తెలిపింది. అయినా ఇండియా వెళ్లకపోతే మాత్రం మెగా టోర్నీలో ఆ జట్టు స్థానంలో మరో టీమ్ రావచ్చనీ చెప్పడం గమనార్హం.
ఎనిమిదేళ్ల తర్వాత టోర్నీ..
ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారి 2017లో జరగగా.. ఫైనల్లో ఇండియాను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఇప్పుడు స్వదేశంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో ఆ జట్టు బరిలోకి దిగనుంది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ శనివారం (నవంబర్ 16) నుంచి జరగనున్నట్లు పీసీబీ వెల్లడించింది. మరోవైపు భద్రతా కారణాలను చూపుతూ పాకిస్థాన్ కు వెళ్లడానికి బీసీసీఐ నిరాకరిసస్తోంది.
అంతేకాదు భారత ప్రభుత్వం అనుమతి ఇస్తేనే వెళ్తామని కూడా స్పష్టం చేసింది. గతేడాది పాకిస్థాన్ లో జరిగిన ఆసియా కప్ కూడా హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించారు. ఇండియా మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించడం విశేషం. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో మాత్రం హైబ్రిడ్ విధానానికి పాకిస్థాన్ కచ్చితంగా నో చెబుతోంది. ఒకవేళ ఐసీసీ ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే టోర్నీ నుంచి తప్పుకోవాలని కూడా పాకిస్థాన్ ఆలోచిస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఐసీసీ నిర్ణయం కీలకంగా మారింది.