IND vs NZ 1st Test: న్యూజిలాండ్ 402కి ఆలౌట్, భారత్ ముందు కొండంత స్కోరు, ఓటమి తప్పదా?
New Zealand All Out: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమిని తప్పించుకోవాలంటే అద్భుతం జరగాల్సిందే. ఇప్పటికే భారత్ ముందు 356 పరుగుల స్కోరు ఉంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో శుక్రవారం 402 పరుగులకి ఆలౌటైంది. మ్యాచ్‌లో తొలి రోజైన బుధవారం వర్షం కారణంగా ఆట రద్దవగా.. రెండో రోజైన గురువారం భారత్ జట్టు 46 పరుగులకే ఆలౌటైంది.
రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ టీమ్ ఈరోజు 402 పరుగులు చేయడంతో.. భారత్ ముందు ఏకంగా 356 పరుగుల స్కోరు నిలిచింది. మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. ఈ టెస్టులో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే భారత్ అద్భుతం చేయాల్సిందే.
భారత్ కంటే కివీస్ బౌలర్ ఎక్కువ రన్స్
భారత్ జట్టు స్టార్ బ్యాటర్లు క్రీజులో నిలబడటానికి ముప్పుతిప్పలు పడిన బెంగళూరు పిచ్‌పై న్యూజిలాండ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సైతం హాఫ్ సెంచరీలు బాదేశారు. ఆ జట్టులో ఓపెనర్ దేవాన్ కాన్వె 105 బంతుల్లో 91 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 157 బంతుల్లో 134 రన్స్ చేశాడు.
న్యూజిలాండ్ టీమ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన పేసర్ టిమ్ సౌథీ సైతం 73 బంతుల్లోన 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 65 పరుగులు చేయడం గమనార్హం. భారత్ జట్టులోని 11 మంది కలిపి తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే.
తేలిపోయిన టీమిండియా బౌలర్లు
న్యూజిలాండ్ టీమ్ భారత్ జట్టుని తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 31.2 ఓవర్లలోనే కుప్పకూల్చగా.. న్యూజిలాండ్ టీమ్‌ను 91.3 ఓవర్లకిగానీ భారత్ బౌలర్లు ఆలౌట్ చేయలేకపోయారు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
దశాబ్దాల తర్వాత పర్యాటక జట్టుకి దాసోహం
భారత్ గడ్డపై టీమిండియాపై తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక ఆధిక్యాన్ని అందుకున్న మూడో టీమ్‌గా న్యూజిలాండ్ నిలిచింది. 2008లో దక్షిణాఫ్రికా టీమ్ అహ్మదాబాద్‌లో భారత్‌పై 418 పరుగుల ఆధిక్యాన్ని అందుకోగా.. 1985లో చెన్నై వేదికగా ఇంగ్లాండ్ టీమ్ 380 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత ఇన్నేళ్లలో తొలిసారి పర్యాటక జట్టుకి భారీ ఆధిక్యాన్ని టీమిండియా సమర్పించుకుంది. ఈరోజు బెంగళూరులో న్యూజిలాండ్ టీమ్ 356 పరుగుల ఆధిక్యాన్ని భారత్‌పై సాధించింది.
భారత్‌కి ఓటమి తప్పాలంటే?
భారత్ జట్టు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే రెండే దార్లు ఉన్నాయి. ఒకటి రెండో ఇన్నింగ్స్‌లో కనీసం శనివారం మధ్యాహ్నం వరకు దూకుడుగా బ్యాటింగ్ చేసి 550 ప్లస్ స్కోరు చేయాలి లేదా ఈ రెండన్న రోజులు ఆలౌట్ అవకుండా వికెట్ కాపాడుకోవాలి. కానీ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైన భారత్ జట్టు పూర్తి ఒత్తిడిలో ఉండటంతో.. రెండూ కష్టంగానే కనిపిస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి..!