న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు ఓటమికి ఎదురీదుతోంది. న్యూజిలాండ్ ముందు కేవలం 107 పరుగుల టార్గెట్‌ను మాత్రమే నిలిపిన టీమిండియా.. ఆదివారం ఓటమిని తప్పించుకోవాలంటే భారత క్రికెట్ చరిత్రలో 20 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతాన్ని పునరావృతం చేయాల్సి ఉంది.
బెంగళూరు టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కేవలం 46 పరుగులకే కుప్పకూలగా, ఆ తర్వాత న్యూజిలాండ్ 402 పరుగులు చేసింది. దాంతో 356 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 462 పరుగులే చేయడంతో న్యూజిలాండ్ ముందు 107 పరుగుల టార్గెట్ నిలిచింది.
107 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ ఆచితూచి ఆడుతోంది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ (0) వికెట్‌ను జస్‌ప్రీత్ బుమ్రా పడగొట్టాడు. దాంతో ప్రస్తుతం క్రీజులో ఉన్న దేవాన్ కాన్వె (12), విల్ యంగ్ (10) అత్యంత జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ.. భారత్ బౌలర్లపై ఒత్తిడిని కొనసాగిస్తున్నారు. దాంతో న్యూజిలాండ్ 22/1తో కొనసాగుతుండగా.. ఆ జట్టు విజయానికి ఇంకా 85 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ జట్టు గెలవాలంటే.. ఇంకా 9 వికెట్లు తీయాలి.
భారత్ గడ్డపై గతంలో 107 పరుగుల లక్ష్యాన్ని టెస్టుల్లో కాపాడుకున్న చరిత్ర టీమిండియాకి ఉంది. 2004లో ఆస్ట్రేలియాతో ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఆస్ట్రేలియా టీమ్ 93 పరుగులకే ఆలౌటైంది. దాంతో 13 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఆ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ నాలుగో 5 వికెట్లు పడగొట్టాడు.
ఆదివారం మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. శనివారం రాత్రి వర్షం పడటంతో స్టేడియంలో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారిపోయింది. దాంతో లేట్ అయ్యింది. ఈరోజు కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఒకవేళ భారీ వర్షం పడినా.. వర్షం ఆగిపోయిన గంటలోపే గ్రౌండ్‌ను సిద్ధం చేసేలా మెరుగైన డ్రైనేజీ సిస్టమ్ చిన్నస్వామి స్టేడియానికి ఉంది.
టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టు చిన్న లక్ష్యాలను కాపాడుకున్న మ్యాచ్‌లివే
భారత్ జట్టుకి చిన్నస్వామి స్టేడియంలో అభిమానుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. బుమ్రా వికెట్ తీసినప్పుడు కేరింతలు, చప్పట్లతో ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అభిమానుల వైపు చూస్తూ టీమిండియా బౌలర్లని ఎంకరేజ్ చేయాలంటూ సైగలు చేస్తూ కనిపించాడు.