India vs Ireland: మ్యాచ్ వర్షార్పణం.. సిరీస్ టీమిండియాదే
India vs Ireland: టీమిండియా, ఐర్లాండ్ మధ్య మూడో టీ20 రద్దయింది. వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే మ్యాచ్ క్యాన్సిల్ అయింది.
India vs Ireland: ఐర్లాండ్‍లో టీమిండియా పర్యటన ముగిసింది. భారత్, ఐర్లాండ్ మధ్య మూడో టీ20 వర్షం కారణంగా రద్దయింది. జోరు వాన కురవటంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ క్యాన్సిల్ అయింది. నేడు (జూలై 23) డబ్లిన్ వేదికగా మూడో టీ20 జరగాల్సి ఉండగా.. వర్షార్పణం అయింది. ఇప్పటికే ఈ సిరీస్‍లో టీమిండియా రెండు మ్యాచ్‍లు గెలిచింది. దీంతో 2-0తో సిరీస్ భారత్ కైవసం అయింది. గాయం కారణంగా 11నెలలు పాటు భారత జట్టుకు దూరమైన భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‍తోనే పునరాగమనం చేశాడు. టీమిండియా టీ20 జట్టుకు అతడు తొలిసారి కెప్టెన్సీ వహించగా.. అతడి సారథ్యంలో తొలి సిరీస్‍నే భారత జట్టు కైవసం చేసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
వర్షం జోరుగా పడటంతో మూడో టీ20లో కనీసం టాస్ కూడా సాధ్యం కాలేదు. పలుమార్లు వాన దోబూచులాడింది. చివరికి మళ్లీ దంచికొట్టింది. దీంతో కొన్నిసార్లు అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. ఇక ఆట సాధ్యం కాదని తేల్చేశారు. టాస్ పడకుండానే ఈ మూడో టీ20ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా కైవసం చేసుకున్నాడు.
ఈ సిరీస్‍లో తొలి టీ20లో టీమిండియా డక్ వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలోనే గెలిచింది. ఈ మ్యాచ్‍కు కూడా వర్షం ఆటంకం కలిగించగా.. డీఎల్ఎస్ మెథడ్‍లో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‍లో భారత బౌలర్లు రాణించగా.. ఐర్లాండ్ 7 వికెట్లకు 139 పరుగులకే పరిమితమైంది. తన పునరాగమనం తొలి ఓవర్లోనే భారత పేసర్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో టీమిండియా 47 పరుగుల వద్ద ఉండగా.. వర్షం వచ్చింది. దీంతో డీఎల్ఎస్ పద్ధతిలో ఈ మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు అంపైర్లు.
రెండో టీ20లో ఐర్లాండ్‍పై టీమిండియా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (58), సంజూ శాంసన్ (40), రింకూ సింగ్ (38) చెలరేగటంతో టీమిండియా ముందుగా 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులే చేయగలిగింది. ఇక నేడు మూడో టీ20 వర్షం కారణం రద్దవటంతో.. 2-0తో సిరీస్‍ను భారత జట్టు కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‍ల్లో కలిపి నాలుగు వికెట్లు తీసిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
టీమిండియా తదుపరి ఆసియా కప్ టోర్నీలో బరికి దిగనుంది. ఈ టోర్నీ ఆగస్టు 30న మొదలుకానుంది. పాకిస్థాన్‍తో సెప్టెంబర్ 2న జరగనున్న మ్యాచ్‍తో ఆసియాకప్ పోరాటాన్ని భారత జట్టు మొదలుపెట్టనుంది. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఆడనుంది భారత్.