ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్.. పటౌడీ స్థానంలో ఆ దిగ్గజాల పేర్లు.. గవాస్కర్ ఫైర్-india vs england series name to be changed from pataudi to sachin tendulkar anderson names sunil gavaskar fire on that ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్.. పటౌడీ స్థానంలో ఆ దిగ్గజాల పేర్లు.. గవాస్కర్ ఫైర్

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్.. పటౌడీ స్థానంలో ఆ దిగ్గజాల పేర్లు.. గవాస్కర్ ఫైర్

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఈ నెలలోనే ఈ రెండు జట్ల మధ్య అయిదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ స్టార్ కాబోతోంది. అయితే ఈ సిరీస్ కు పటౌడీ ట్రోఫీ స్థానంలో సచిన్, అండర్సన్ పేరు పెట్టబోతున్నట్లు సమాచారం. దీనిపై గవాస్కర్ ఫైర్ అయ్యాడు.

జేమ్స్ అండర్సన్, సచిన్ టెండూల్కర్ (Getty Images)

జూన్ 20 నుంచి ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ స్టార్ట్ కాబోతోంది. అయిదు మ్యాచ్ ల సిరీస్ లో ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. అయితే ఈ సిరీస్ కు పేరు మార్పు చేయాలనే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓ వైపు విమర్శలు వస్తున్నాయి. పటౌడీ ట్రోఫీ బదులు అండర్సన్-సచిన్ ట్రోఫీ అని పేరు మార్చబోతున్నారని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది.

ఆ ఫైనల్లో జెర్సీ లాంఛ్

ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం పటౌడీ ట్రోఫీకి అండర్సన్-సచిన్ పేరు పెట్టబోతున్నారని తెలిసింది. జూన్ 11 న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఈ ఇద్దరు దిగ్గజాలు కొత్త జెర్సీని ఆవిష్కరించనున్నారు. ఈ నెల 20 నుంచి హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభమవుతుంది. దీంతోనే కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ స్టార్ట్ అవుతుంది.

ఆ పేరుతో

ఇప్పటి వరకు భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. దీనికి భారత మాజీ కెప్టెన్లు ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ, ఆయన తనయుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరు కలిసేలా పెట్టారు. భారతదేశంలో దీనికి సమానమైన సిరీస్ ను ఆంథోనీ డి మెల్లో ట్రోఫీ అని పిలిచేవారు. 1946-47 నుండి 1950-51 వరకు బోర్డు ప్రారంభ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేసిన ఆంథోనీ డి మెల్లో పేరును ట్రోఫీకి పెట్టారు.

దిగ్గజ ప్లేయర్స్

టెస్టుల్లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జేమ్స్ అండర్సన్. సుదీర్ఘ ఫార్మాట్లో 704 వికెట్లతో అత్యంత విజయవంతమైన పేసర్ గా నిలిచాడు. ఈ కుడిచేతి వాటం పేసర్ గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 1989 నుంచి 2013 వరకు 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 200 టెస్టులు ఆడాడు. ఇటీవల ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ కు క్రో-థోర్ప్ ట్రోఫీని అనే పేరు పెట్టారు.

క్రికెటర్లు తిరస్కరించాలి

ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్ కు పటౌడీ ట్రోఫీ పేరు మార్చడంపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ పేర్లను సిరీస్ కు పెట్టాలనే ఈసీబీ రిక్వెస్ట్ ను భారత క్రికెటర్లు తిరస్కరించాలని ఆయన కోరారు. ‘‘ఇంగ్లండ్, భారత్ రెండు దేశాల క్రికెట్ కు పటౌడీలు అందించిన సహకారం పట్ల గౌరవం లేకపోవడానికి ఇది నిదర్శనం. ఒక కొత్త ట్రోఫీకి ఇటీవలి ఆటగాళ్ల పేరు పెట్టవచ్చు. అయితే ఒక భారతీయ ఆటగాడిని సంప్రదిస్తే, అతను మర్యాదగా తిరస్కరించే మంచి జ్ఞానం కలిగి ఉంటాడని ఇక్కడ ఆశిస్తున్నాం. ఇద్దరు భారత మాజీ కెప్టెన్ల పట్ల గౌరవంతో మాత్రమే కాదు, అతను పోయిన తర్వాత అతని పేరు మీద ఒక ట్రోఫీని కలిగి ఉండాలనే ఆలోచనతో ఉండాలి’’ అని కాలమ్ లో గవాస్కర్ పేర్కొన్నాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం