Ind vs Eng Tickets: ఇండియా, ఇంగ్లండ్ వన్డే మ్యాచ్ టికెట్ల కోసం ఎగబడిన ఫ్యాన్స్.. తొక్కిసలాట.. వాటర్ గన్స్ ప్రయోగం
Ind vs Eng Tickets: ఇండియా, ఇంగ్లండ్ వన్డే మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు వాటర్ గన్స్ ఉపయోగించి అభిమానులు చెల్లాచెదురు చేయాల్సి వచ్చింది. ఒడిశాలోని కటక్ లో ఈ పరిస్థితి ఏర్పడింది.
Ind vs Eng Tickets: ఇండియా, ఇంగ్లండ్ మధ్య వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 9) కటక్ లోని బారాబతి స్టేడియంలో రెండో వన్డే జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను వాటర్ గన్స్ సాయంతో చెల్లాచెదురు చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 4) రాత్రి నుంచే ఫ్యాన్స్ టికెట్ల కోసం వేచి చూస్తున్నారు.
టికెట్ల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్
ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలుసు కదా. తొలి వన్డే నాగ్‌పూర్ లో జరగనుండగా.. రెండో వన్డే ఒడిశాలోని కటక్ లో ఉన్న బారాబతి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఫిబ్రవరి 2 నుంచే ఆన్‌లైన్లో టికెట్ల అమ్మకం ప్రారంభించారు.
అలా గంటల తరబడి చూసినా టికెట్లు పొందలేని వాళ్ల కోసం ఫిబ్రవరి 5, 6 తేదీల్లో మరోసారి ఫిజికల్ టికెట్ల అమ్మకం చేయనున్నట్లు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ మంగళవారం రాత్రి నుంచే ఎగబడ్డారు. బుధవారం (ఫిబ్రవరి 5) ఉదయం టికెట్ల అమ్మకం ప్రారంభం కాగానే ఒక్కసారిగా అభిమానులు స్టేడియం గేటు దగ్గరికి దూసుకొచ్చారు. కొందరు రాత్రంతా స్టేడియం దగ్గరే నిద్రించారు.
సుమారు ఐదేళ్ల తర్వాత ఇక్కడ మ్యాచ్ జరుగుతుండటం, రోహిత్, కోహ్లిలాంటి వాళ్లు ఆడుతుండటంతో ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడ్డారు. దీనిని ఊహించని ఒడిశా క్రికెట్ అసోసియేషన్ సరైన ఏర్పాట్లు చేయలేకపోయిందని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. టికెట్లు తీసుకొని బయటకు వెళ్లడానికి దారి లేకపోవడంతో ఈ గందరగోళం నెలకొన్నట్లు అక్కడి అభిమానులు చెప్పారు. కొందరు ఊపిరాడక పడిపోవడంతో వాళ్లను ఆసుపత్రులకు తరలించినట్లు కూడా ఓ అభిమాని వెల్లడించారు. తాగడానికి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని వాళ్లు ఆరోపించారు.
వాటర్ గన్స్ ఉపయోగించిన పోలీసులు
స్టేడియం దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికి డీసీపీ నేతృత్వంలోని పోలీసులు స్టేడియం దగ్గర పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అభిమానులను చెదరగొట్టడానికి వాటర్ గన్స్ వినియోగించారు. టికెట్ల కొనుగోలు సమయంలో సహనంతో వ్యవహరించాలని సూచించారు.
ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20 సిరీస్ ను 4-1తో గెలుచుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ లోనూ ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతోంది. తొలి వన్డే గురువారం (ఫిబ్రవరి 6) నాగ్‌పూర్ లో జరగనుంది. దీనికోసం రెండు టీమ్స్ ఇప్పటికే అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఆడబోయే చివరి వన్డే సిరీస్ ఇదే. దీంతో ఈ సిరీస్ సన్నద్ధత కోసం కీలకంగా మారింది.
సంబంధిత కథనం