india vs england 3rd odi: భారత్ అదుర్స్.. సిరీస్ క్లీన్ స్వీప్.. 3-0తో ఇంగ్లండ్ వైట్ వాష్.. మూడో వన్డే టీమ్ఇండియాదే
india vs england 3rd odi: భారత క్రికెట్ జట్టు అదరగొట్టింది. బుధవారం అహ్మదాబాద్ లో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ ను చిత్తుచేసింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. స్వదేశంలో తమకు తిరుగులేదని టీమ్ఇండియా మరోసారి చాటింది.
వారెవా టీమ్ఇండియా. బలమైన ఇంగ్లండ్ పై వన్డే సిరీస్ ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ప్రత్యర్థిని ఒక్క మ్యాచ్ గెలవనీయకుండా సిరీస్ ను రోహిత్ సేన 3-0తో సొంతం చేసుకుంది. బుధవారం (ఫిబ్రవరి 12) భారత్ 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట శుభ్ మన్ గిల్ సెంచరీ సాయంతో భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్ ఇంగ్లండ్ 34.2 ఓవర్లలోనే 214 పరుగులకు కుప్పకూలింది.
బౌలర్స్ అదుర్స్
ఛేదనలో ఇంగ్లండ్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. అద్భుతమైన బౌలింగ్ తో అదుర్స్ అనిపించారు. అర్ష్ దీప్ (2/33), హర్షిత్ రాణా (2/31), అక్షర్ పటేల్ (2/22), హార్దిక్ పాండ్య (2/38) సత్తాచాటారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. ప్రత్యర్థిని ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. ఇంగ్లండ్ జట్టులో టామ్ బాంటన్ (38), అట్కిన్సన్ (38) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
గిల్ సెంచరీ
మొదట టీమ్ ఇండియా బ్యాటింగ్ లో యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ (112) సూపర్ సెంచరీతో వారెవా అనిపించాడు. శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లి (52), కేఎల్ రాహుల్ (40) కూడా బ్యాట్ తో సత్తాచాటారు. రెండో వికెట్ కు గిల్, కోహ్లి 116 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మూడో వికెట్ కు గిల్, శ్రేయస్ 104 పరుగుల జతచేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (4/64) నాలుగు వికెట్లు పడగొట్టాడు.
జోష్ తో ఛాంపియన్స్ ట్రోఫీకి
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ఇండియా ఫుల్ జోష్ తో వెళ్లనుంది. ఎందుకంటే ఇంగ్లండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ను వన్డేల్లో వైట్ వాష్ చేయడం సాధారణ విషయం కాదు. సొంతగడ్డపై ఆడినప్పటికీ ప్రమాదకర ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ పై సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం కష్టమైన పనే. కానీ భారత్ పూర్తి ఆధిపత్యంతో అదరగొట్టింది. బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మెరిశారు. గిల్, రోహిత్ ఒక్కో శతకం బాదారు. బౌలింగ్ లో జడేజా, హర్షిత్ రాణా, అర్ష్ దీప్, హార్దిక్ రాణించారు.
సంబంధిత కథనం