India vs England Live Score: అశ్విన్ వందో టెస్టులో కుల్దీప్ మాయ.. కుప్పకూలిన ఇంగ్లండ్
India vs England Live Score: టీమిండియా సీరియర్ స్పిన్నర్ అశ్విన్ వందో టెస్టులో కుల్దీప్ మాయ చేశాడు. అతడు 5 వికెట్లు తీయడంతోపాటు అశ్విన్ కూడా 4 వికెట్లతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది.
India vs England Live Score: ఇండియాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి రోజే ఇంగ్లండ్ కు స్పిన్ దెబ్బ గట్టిగానే తగిలింది. కుల్దీప్ యాదవ్ తన లెగ్ స్పిన్ తో చెలరేగడంతో ఆ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 218 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ జాక్ క్రాలీ ఒక్కడే 79 పరుగులతో రాణించగా.. మిడిలార్డర్ పూర్తిగా చేతులెత్తేయడంతో ఇంగ్లిష్ టీమ్ తక్కువ స్కోరుకే చాప చుట్టేసింది.
కుల్దీప్, అశ్విన్ స్పిన్ మాయ
ఇంగ్లండ్ తో ధర్మశాలలో టీమిండియా ఆడుతున్న టెస్టు సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కు కెరీర్లో 100వది కావడం విశేషం. ఈ మ్యాచ్ లో కుల్దీప్ 5 వికెట్లతో చెలరేగాడు. అతనికి అశ్విన్ కూడా మంచి సహకారం అందిస్తూ 4 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 57.4 ఓవర్లలోనే 218 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ 79 రన్స్ చేశాడు.
ఇంగ్లండ్ తరఫున 100వ టెస్టు ఆడుతున్న జానీ బెయిర్ స్టో 29 పరుగులతో రెండో అత్యధిక స్కోరర్ గా కాగా.. బెన్ డకెట్ 27, జో రూట్ 26, బెన్ ఫోక్స్ 24 పరుగులు చేశారు. నిజానికి ఈ మ్యాచ్ ను ఇంగ్లండ్ బలంగానే ప్రారంభించింది. మొదట్లోనే బుమ్రా తన పదునైన పేస్ బౌలింగ్ తో ఇబ్బంది పెట్టినా.. ఇంగ్లండ్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకున్నారు.
ఓపెనర్లు క్రాలీ, డకెట్ తొలి వికెట్ కు 64 పరుగులు జోడించారు. తర్వాత డకెట్ ఔటైనా.. ఓలీ పోప్ (11)తో మళ్లీ ఇన్నింగ్స్ నిర్మించేందుకు క్రాలీ ప్రయత్నించాడు. అయితే సరిగ్గా లంచ్ కు ముందు పోప్ కూడా ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లు కుల్దీప్ కే దక్కాయి. దీంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్లకు 100 రన్స్ చేసింది. అయితే లంచ్ నుంచి టీ మధ్యలో ఆట మారిపోయింది.
రెండో సెషన్ టీమిండియాదే..
టీమిండియా స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రెండోసెషన్ లో కుల్దీప్ కు అశ్విన్ కూడా తోడవడంతో ఇక ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. ఒక దశలో 2 వికెట్లకు 137 రన్స్ తో ఉన్న ఆ టీమ్.. 183 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. చివర్లో షోయబ్ బషీర్ (11)తో కలిసి బెన్ ఫోక్స్ పోరాడటంతో ఇంగ్లండ్ స్కోరు 200 దాటింది.
కెప్టెన్ బెన్ స్టోక్స్ డకౌటయ్యాడు. స్టోక్స్ తోపాటు డకెట్, క్రాలీ, పోప్, బెయిర్ స్టోలాంటి కీలకమైన వికెట్లను కుల్దీప్ తీశాడు. ఇక సీనియర్ బ్యాటర్ జో రూట్ (26)ను జడేజా ఔట్ చేశాడు. ఫోక్స్, హార్ట్‌లీ, ఆండర్సన్, వుడ్ వికెట్లను అశ్విన్ తీశాడు. తొలి రోజే ఇంగ్లండ్ ను తక్కువ స్కోరుకే ఇండియా పరిమితం చేయడంతో ఈ మ్యాచ్ పై పట్టు బిగించినట్లే. తొలి ఇన్నింగ్స్ లో మంచి లీడ్ సాధిస్తే సిరీస్ ను ఘనంగా ముగించే అవకాశం ఉంటుంది.