Ind vs Eng 4th T20: నాలుగో టీ20లో ఇంగ్లండ్ చిత్తు.. మరో టీ20 సిరీస్ గెలిచిన వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా
Ind vs Eng 4th T20: టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా మరో టీ20 సిరీస్ గెలిచింది. ఇంగ్లండ్ తో శుక్రవారం (జనవరి 31) జరిగిన నాలుగో టీ20లో విజయం సాధించడం ద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ లో తిరుగులేని 3-1 లీడ్ సాధించింది.
Ind vs Eng 4th T20: టీమిండియా ఖాతాలో మరో టీ20 సిరీస్ విజయం చేరింది. ఇంగ్లండ్ తో ఐదు టీ20ల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. నాలుగో టీ20లో ఇంగ్లండ్ ను 15 పరుగులతో చిత్తు చేసింది ఇండియన్ టీమ్. దీంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మరో టీ20 సిరీస్ మన సొంతమైంది. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్ గా వచ్చిన హర్షిత్ రాణా 3, రవి బిష్ణోయ్ 3, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు.

ఇంగ్లండ్ చిత్తు
టీమిండియా విధించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఒక దశలో ఇంగ్లండ్ సులువుగా ఛేజ్ చేసేలా కనిపించింది. వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసిన ఆ టీమ్.. మిడిల్ ఓవర్లలో దారి తప్పింది. హ్యారీ బ్రూక్ 26 బంతుల్లోనే 51, ఓపెనర్ బెన్ డకెట్ 19 బంతుల్లో 39 రన్స్ చేశారు. అయితే కీలకమైన సమయంలో జోస్ బట్లర్ (2), లివింగ్‌స్టన్ (9), జేకబ్ బేతెల్ (6), బ్రైడన్ కార్స్ (0) విఫలమవడంతో ఇంగ్లండ్ తడబడింది.
అంతకుముందు హాఫ్ సెంచరీ చేసిన శివమ్ దూబె కాన్‌కషన్ కు గురవడంతో సబ్‌స్టిట్యూట్ గా వచ్చిన హర్షిత్ రాణా 3, రవి బిష్ణోయ్ 3, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో ఇంగ్లండ్ 166 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ గెలిచింది.
ఆ ఇద్దరూ చెలరేగడంతో..
అంతకుముందు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె చివర్లో దంచి కొట్టడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. మొదట్లో తడబడి 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. ఈ ఇద్దరూ చెలరేగడంతో ఇండియన్ టీమ్ ఫైటింగ్ స్కోరు సాధించగలిగింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 రన్స్ చేసింది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె ఆరో వికెట్ కు 87 రన్స్ జోడించడంతో ఈమాత్రం స్కోరైనా చేసింది.
హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడు కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చివరికి 30 బంతుల్లోనే 4 సిక్స్ లు, 4 ఫోర్లతో 53 రన్స్ చేసి 18వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. శివమ్ దూబె కూడా చెలరేగాడు. అతడు 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 53 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి అతడు రనౌటయ్యాడు.
ఇంగ్లండ్ పేస్ బౌలర్ సఖీబ్ మహమూద్ దెబ్బకు టీమిండియా మొదట్లోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. అతడు 3 వికెట్లు తీయడంతో 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే మధ్యలో రింకు సింగ్ కూడా చెలరేగాడు. గాయం కారణంగా మధ్యలో రెండు టీ20లకు దూరమైన రింకు.. ఈ మ్యాచ్ లో 26 బంతుల్లో 30 రన్స్ చేశాడు.
అంతకుముందు ఓపెనర్ అభిషేక్ శర్మ 19 బంతుల్లో 29 రన్స్ చేశాడు. అయితే మరో ఓపెనర్ సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. చివర్లో హార్దిక్, శివమ్ దూబె చెలరేగడంతో ఆమాత్రం స్కోరైనా సాధించగలిగింది.
సంబంధిత కథనం