India vs England 3rd T20: ఇంగ్లండ్‌కు వరుణ్ చక్రవర్తి స్పిన్ ఉచ్చు.. మొదట రెచ్చిపోయి చతికిల పడిన బట్లర్ టీమ్-india vs england 3rd t20i varun chakravarthy fifer restricts visitors to 170 runs score on a batting pitch ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs England 3rd T20: ఇంగ్లండ్‌కు వరుణ్ చక్రవర్తి స్పిన్ ఉచ్చు.. మొదట రెచ్చిపోయి చతికిల పడిన బట్లర్ టీమ్

India vs England 3rd T20: ఇంగ్లండ్‌కు వరుణ్ చక్రవర్తి స్పిన్ ఉచ్చు.. మొదట రెచ్చిపోయి చతికిల పడిన బట్లర్ టీమ్

Hari Prasad S HT Telugu

India vs England 3rd T20: ఇంగ్లండ్ మరోసారి వరుణ్ చక్రవర్తి స్పిన్ ఉచ్చులో చిక్కుకుంది. ఈ మిస్టరీ స్పిన్నర్ ఐదు వికెట్లు తీయడంతో మొదట రెచ్చిపోయిన ఇంగ్లండ్ టీమ్.. తర్వాత చతికిల పడింది. దీంతో టీమిండియా ముందు 171 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది.

ఇంగ్లండ్‌కు వరుణ్ చక్రవర్తి స్పిన్ ఉచ్చు.. మొదట రెచ్చిపోయి చతికిల పడిన బట్లర్ టీమ్

India vs England 3rd T20: ఇంగ్లండ్‌కు మరోసారి ముకుతాడు వేశాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. అతడు 4 ఓవర్లలో కేవలం 24 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీయడంతో ఆ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 170 రన్స్ చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ హాఫ్ సెంచరీకి తోడు చివర్లో లియామ్ లివింగ్‌స్టన్ మెరుపులతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.

ఇంగ్లండ్‌కు వరుణ్ స్పిన్ ఉచ్చు

ఇంగ్లండ్ టీమ్ మరోసారి తన నిర్లక్ష్యపు బ్యాటింగ్ తమ గొయ్యి తామే తవ్వుకుంది. మొదట ఓపెనర్ బెన్ డకెట్ వీరవిహారం చేసి 28 బంతుల్లోనే 53 రన్స్ చేయడంతో ఇంగ్లండ్ ఓ దశలో 8 ఓవర్లలోనే కేవలం వికెట్ నష్టపోయి 80కిపైగా పరుగులు చేసింది. 

అయితే వరుణ్ చక్రవర్తి రంగంలోకి దిగిన తర్వాత కథ మారిపోయింది. అతని స్పిన్ కు తోడు నిర్లక్ష్యపు షాట్లతో ఇంగ్లండ్ బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. 200కుపైగా రన్స్ చేయడం ఖాయంగా కనిపించినా.. ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టడంతో ఆ టీమ్ చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ బెన్ డకెట్ కు తోడు చివర్లో లివింగ్‌స్టన్ కూడా 24 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. 

అతని ఇన్నింగ్స్ లో 5 సిక్స్ లు ఉన్నాయి. రవి బిష్ణోయ్ వేసిన ఒకే ఓవర్లో అతడు మూడు సిక్స్‌లు బాదడం విశేషం. ఆ ఓవర్లో మొత్తంగా 19 పరుగులు వచ్చాయి. దీంతో బిష్ణోయ్ 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నట్లయింది. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ 3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.

తుది జట్టులోకి షమి

అంతకుముందు వరుసగా మూడో టీ20లోనూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు. ఈసారి తుది జట్టులో ఒక మార్పుతో టీమిండియా బరిలోకి దిగింది. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమి వచ్చాడు. 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత షమి మళ్లీ ఇండియన్ టీమ్ లోకి రావడం ఇదే తొలిసారి. 

అయితే అతడు ఈ మ్యాచ్ లో పెద్దగా రాణించలేదు. అతడు 3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. తాను వేసిన చివరి ఓవర్లో ఓ హైట్ నోబాల్ కూడా వేశాడు.