Ind vs Eng 3rd T20: మూడో టీ20లో చేతులెత్తేసిన టీమిండియా బ్యాటర్లు.. ఇంగ్లండ్ బోణీ.. తగ్గిన ఆధిక్యం
Ind vs Eng 3rd T20: ఇంగ్లండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డారు. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకొని ఓటమి కొనితెచ్చుకున్నారు.
Ind vs Eng 3rd T20: ఇంగ్లండ్ బోణీ చేసింది. మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు విఫలమవడంతో రాజ్‌కోట్ లో 25 పరుగులతో గెలిచింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ లో టీమిండియా ఆధిక్యం 2-1కి తగ్గింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ఇక్కడే గెలుస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. హార్దిక్ పాండ్యా (35 బంతుల్లో 40) పోరాడినా.. మిగిలిన బ్యాటర్లంతా విఫలమవడంతో ఓటమి తప్పలేదు. చివరికి 20 ఓవర్లలో ఇండియా 9 వికెట్లకు 146 పరుగులే చేయగలిగింది.
చేతులెత్తేసిన టీమిండియా బ్యాటర్లు
రాజ్‌కోట్ లో టీమిండియా ముందు ఇంగ్లండ్ 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిజానికి ఇదేమీ అంత కష్టమైన టార్గెట్ ఏమీ కాదు. అయితే మొదటి నుంచీ భారత బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్లు పారేసుకున్నారు.
ఓపెనర్లు సంజూ శాంసన్ (3), అభిషేక్ శర్మ (14 బంతుల్లో 24)తోపాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (14), రెండో టీ20 హీరో తిలక్ వర్మ (18), వాషింగ్టన్ సుందర్ (6) దారుణంగా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా ఒక్కడే 35 బంతుల్లో 40 పరుగులు చేసిన పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో ఇంగ్లండ్ తన ఆశలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. ఇండియా ఆధిక్యం 2-1కి తగ్గింది.
ఇంగ్లండ్ బౌలర్లో జేమీ ఓవర్టన్ 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ కూడా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
ఇంగ్లండ్‌కు వరుణ్ స్పిన్ ఉచ్చు
అంతకుముందు ఇంగ్లండ్ టీమ్ మరోసారి తన నిర్లక్ష్యపు బ్యాటింగ్ తమ గొయ్యి తామే తవ్వుకుంది. మొదట ఓపెనర్ బెన్ డకెట్ వీరవిహారం చేసి 28 బంతుల్లోనే 53 రన్స్ చేయడంతో ఇంగ్లండ్ ఓ దశలో 8 ఓవర్లలోనే కేవలం వికెట్ నష్టపోయి 80కిపైగా పరుగులు చేసింది.
అయితే వరుణ్ చక్రవర్తి రంగంలోకి దిగిన తర్వాత కథ మారిపోయింది. అతని స్పిన్ కు తోడు నిర్లక్ష్యపు షాట్లతో ఇంగ్లండ్ బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. 200కుపైగా రన్స్ చేయడం ఖాయంగా కనిపించినా.. ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టడంతో ఆ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 రన్స్ మాత్రమే చేసింది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఓపెనర్ బెన్ డకెట్ కు తోడు చివర్లో లివింగ్‌స్టన్ కూడా 24 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు.
అతని ఇన్నింగ్స్ లో 5 సిక్స్ లు ఉన్నాయి. రవి బిష్ణోయ్ వేసిన ఒకే ఓవర్లో అతడు మూడు సిక్స్‌లు బాదడం విశేషం. ఆ ఓవర్లో మొత్తంగా 19 పరుగులు వచ్చాయి. దీంతో బిష్ణోయ్ 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నట్లయింది. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ 3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
తుది జట్టులోకి షమి
అంతకుముందు వరుసగా మూడో టీ20లోనూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు. ఈసారి తుది జట్టులో ఒక మార్పుతో టీమిండియా బరిలోకి దిగింది. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమి వచ్చాడు. 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత షమి మళ్లీ ఇండియన్ టీమ్ లోకి రావడం ఇదే తొలిసారి.
అయితే అతడు ఈ మ్యాచ్ లో పెద్దగా రాణించలేదు. అతడు 3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. తాను వేసిన చివరి ఓవర్లో ఓ హైట్ నోబాల్ కూడా వేశాడు.