Ind vs Eng 3rd T20: మూడో టీ20లోనూ టాస్ గెలిచిన సూర్యకుమార్.. మళ్లీ ఫీల్డింగే.. షమి వచ్చేశాడు
Ind vs Eng 3rd T20: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టీ20లోనూ టీమిండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్టులోకి చాలా రోజుల తర్వాత షమి తిరిగి రావడం విశేషం.
Ind vs Eng 3rd T20: సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడోసారీ టాస్ గెలిచాడు. మూడోసారీ మొదట ఫీల్డింగే ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ తో రాజ్‌కోట్ లో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా మొదట బౌలింగ్ చేయనుండగా.. పేస్ బౌలర్ మహ్మద్ షమి సుమారు 15 నెలల తర్వాత మరోసారి తుది జట్టులోకి వచ్చాడు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కు విశ్రాంతినిచ్చారు.

2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత షమి టీమిండియాకు ఆడటం ఇదే తొలిసారి. గతేడాది మొత్తం గాయం కారణంగా అతడు దూరమైన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ సిరీస్ కు ఎంపిక చేసినా.. తొలి రెండు టీ20లకు అతన్ని పక్కన పెట్టారు. మొత్తానికి మూడో మ్యాచ్ లో అవకాశం ఇచ్చారు.
టీమిండియా ఈ మూడో టీ20లో ఈ ఒక్క మార్పు మాత్రమే చేసింది. మిగతా టీమ్ అంతా రెండో మ్యాచ్ లో ఆడినవాళ్లే ఉన్నారు. తొలి రెండు టీ20ల్లో విఫలమైనా ధృవ్ జురెల్ ను కొనసాగించారు. దీంతో శివమ్ దూబెకు మరోసారి నిరాశే ఎదురైంది. షమి తుది జట్టులోకి రావడంతో అందరి కళ్లూ అతనిపైనే ఉన్నాయి. అటు ఇంగ్లండ్ మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతోంది. రెండో టీ20లో ఆడిన జట్టునే కొనసాగించింది.
ఇండియా తుది జట్టు ఇదే
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, ధృవ్ జురెల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్