India vs England 1st T20: భారత్, ఇంగ్లండ్ తొలి టీ20 నేడే.. హెడ్ టూ హెడ్ రికార్డ్ ఇలా.. పిచ్ ఎలా ఉండనుందంటే..
India vs England 1st T20: భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 నేడు (జనవరి 22) జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ పోరు ఉండనుంది. ఈ మ్యాచ్ కోసం పిచ్ ఎలా ఉండనుందో, ఇరు జట్ల టీ20 హెడ్ టూ హెడ్ రికార్డు ఎలా ఉందో ఇక్కడ చూడండి.
స్వదేశంలో టీ20 పోరుకు టీమిండియా రెడీ అయింది. ఇంగ్లండ్‍తో పొట్టి క్రికెట్ సిరీస్‍కు అంతా సిద్ధమైంది. ఐదు మ్యాచ్‍ల సిరీస్‍లో భారత్, ఇంగ్లండ్ మధ్య నేడు (జనవరి 22) తొలి టీ20 జరగనుంది. కోల్‍కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ ఉండనుంది. ఇప్పటికే ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి.

హెడ్ టూ హెడ్ రికార్డు
భారత్, ఇంగ్లండ్ ఇప్పటి వరకు 24 టీ20లు పరస్పరం ఆడాయి. అందులో 13 మ్యాచ్‍ల్లో ఇండియా విజయం సాధించింది. 11 టీ20ల్లో ఇంగ్లండ్ గెలిచింది. ఓవరాల్‍లో హెడ్ టూ హెడ్‍లో భారత్‍దే పైచేయిగా ఉంది. ఈ ఇరు జట్లు తలపడిన చివరి ఐదు టీ20ల్లో టీమిండియా మూడు గెలువగా.. ఇంగ్లండ్ రెండింట్లో విన్ అయింది.
తొలి టీ20కి పిచ్ ఇలా..
భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్‍లో తొలి టీ20 ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్‍లో సాగనుంది. ఈ పిచ్‍పై బౌన్స్ మెరుగ్గా ఉంటుంది. పిచ్ బ్యాటింగ్‍కు ఎక్కువగా సహకరిస్తుంది. బౌండరీలు కూడా చిన్నగా ఉండనున్నాయి. దీంతో పరుగులు భారీగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. చలికాలం కావడంతో మంచు వల్ల బంతి త్వరగా తడి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది బౌలర్లకు ఇబ్బందిగా ఉంటుంది. బ్యాటర్లకు ఇది కూడా ప్లస్ కానుంది.
ఈ మ్యాచ్‍తో సుమారు 14 నెలల తర్వాత మళ్లీ టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నాడు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ. గాయం వల్ల 2023 వన్డే ప్రపంచకప్ తర్వాతి నుంచి జట్టుకు దూరమయ్యాడు షమీ. శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.
భారత్, ఇంగ్లండ్ తొలి టీ20 టైమ్, లైవ్ స్ట్రీమింగ్
ఇండియా, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 నేటి (జనవరి 22) సాయంత్రం 7 గంటలకు షురూ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
తుది జట్లు ఇలా..
ఈ తొలి టీ20లో భారత తుది జట్టులో తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కుతుందా అనేది సందిగ్ధంగా ఉంది. పేసర్ హర్షిత్ రాణాకు అవకాశం ఇవ్వాలన్నా.. లేకపోతే అదనపు స్పిన్నర్ కావాలన్నా నితీశ్‍నే తప్పించే అవకాశం ఉంటుంది.
భారత తుదిజట్టు (అంచనా): సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి / హర్షిత్ రాణా/ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్
ఈ మ్యాచ్ కోసం తుది జట్టును ఇంగ్లండ్ ఒకరోజు ముందే వెల్లడించింది. ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జాస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియమ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, జాకబ్ బెథల్, గస్ అట్కిన్‍సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
సంబంధిత కథనం