Ind vs Eng 1st T20: అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్.. తొలి టీ20లో ఇంగ్లండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా
Ind vs Eng 1st T20: అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో తొలి టీ20లో ఇంగ్లండ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా. అభిషేక్ కేవలం 34 బంతుల్లోనే 79 రన్స్ చేయడం విశేషం.
Ind vs Eng 1st T20: టీ20ల్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 133 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్ 34 బంతుల్లో 8 సిక్స్ లు, 5 ఫోర్లతో 79 రన్స్ చేయడం విశేషం. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో ఇండియా 1-0 ఆధిక్యం సంపాదించింది.

అభిషేక్ విధ్వంసం.. ఇంగ్లండ్ చిత్తు
అభిషేక్ శర్మ తన విధ్వంసక ఆటతీరును కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ తో తొలి టీ20లోనూ అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు.. చివరికి 34 బంతుల్లో 79 రన్స్ చేయడంతో 133 పరుగుల లక్ష్యాన్ని ఇండియన్ టీమ్ సునాయాసంగా ఛేదించింది.
అంతకుముందు సంజూ శాంసన్ కూడా 20 బంతుల్లోనే 26 రన్స్ చేశాడు. తిలక్ వర్మ 16 బంతుల్లో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం డకౌటై నిరాశ పరిచాడు. అభిషేక్ ధాటికి ఇంగ్లండ్ బౌలర్ అట్కిన్సన్ 2 ఓవర్లలోనే 38 పరుగులు సమర్పించుకున్నాడు.
చేతులెత్తేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు
అంతకుముందు ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావించిన పిచ్ పైనా మన బౌలర్లు కెప్టెన్ సూర్య తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. మొదట్లోనే అర్ష్ దీప్ సింగ్ రెండు కీలకమైన వికెట్లతో ఇంగ్లండ్ టాపార్డర్ ను కూల్చగా.. తర్వాత స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మిడిలార్డర్ తో ఆటాడుకున్నారు. దీంతో 20 ఓవర్లలో 132 పరుగులకు ఆ టీమ్ ఆలౌటైంది.
వరుణ్ 3 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్, అక్షర్ చెరో రెండు వికెట్లతో రాణించారు. అర్ష్‌దీప్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే ఇవ్వగా.. వరుణ్ 23 పరుగులు ఇచ్చాడు. అక్షర్ పటేల్ కూడా 4 ఓవర్లలో ఓ మెయిడిన్ తోపాటు 22 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ వికెట్ తీయకపోయినా.. 4 ఓవర్లలో 22 పరుగులే ఇవ్వడం విశేషం. హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తీసినా.. అతడు 4 ఓవర్లలో ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు.
బట్లర్ ఒక్కడే
ఇంగ్లండ్ టీమ్ లో కెప్టెన్ జోస్ బట్లర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు 44 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్ లతో 68 రన్స్ చేశాడు. ప్రతి టీమిండియా బౌలర్ ను సమర్థంగా ఎదుర్కొన్న ఏకైక ఇంగ్లండ్ బ్యాటర్ అతడే. మిగిలిన వాళ్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నా.. బట్లర్ క్రీజులో నిలదొక్కుకొని ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరైనా సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే 17వ ఓవర్లో స్కోరు వేగం పెంచడానికి ఓ భారీ షాట్ ఆడబోయి నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన క్యాచ్ తో వెనుదిరిగాడు.