Ind vs Eng 1st ODI Live: తొలి వన్డేలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. శ్రేయస్, గిల్, అక్షర్ హాఫ్ సెంచరీల మోత
Ind vs Eng 1st ODI Live: టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ చిత్తుగా ఓడింది. బౌలింగ్ లో జడేజా, హర్షిత్ రాణా మూడేసి వికెట్లు తీయడంతోపాటు బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలు చేయడంతో ఇండియన్ టీమ్ సులువుగా విజయం సాధించింది.
Ind vs Eng 1st ODI Live: వన్డే సిరీస్ లోనూ టీమిండియా బోణీ చేసింది. నాగ్‌పూర్ లో గురువారం (ఫిబ్రవరి 6) జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లతో విజయం సాధించింది. నిజానికి మరింత ఘనంగా గెలిచేలా కనిపించినా.. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి ఛేదించింది. గిల్ 87, శ్రేయస్ 59, అక్షర్ పటేల్ 52 పరుగులు చేశారు.
ఛేజింగ్ లో 19 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ కలిసి మూడో వికెట్ కు 94 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడిన శ్రేయస్.. 30 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్ లతో హాఫ్ సెంచరీ చేశాడు. అటు గిల్ నిదానంగా ఆడినా.. అతడు కూడా 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
శ్రేయస్ 59 రన్స్ చేసి ఔటైన తర్వాత బ్యాటింగ్ లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ కూడా దూకుడుగా ఆడాడు. అక్షర్ కూడా 46 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. గిల్ తో కలిసి అతడు నాలుగో వికెట్ కు 108 పరుగులు జోడించాడు. ఆ తర్వాత 52 పరుగుల దగ్గర ఔటయ్యాడు. గిల్ సెంచరీ చేస్తాడనుకున్నా.. 87 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. మధ్యలో కేఎల్ రాహుల్ (2) నిరాశ పరిచాడు. చివర్లో వరుస వికెట్లతో ఉత్కంఠ నెలకొన్నా.. జడేజా, హార్దిక్ మరో వికెట్ పడకుండా గెలిపించారు.
ఇంగ్లండ్ కుదేలు
అంతకుముందు ఇంగ్లండ్ కు మంచి ఆరంభం లభించినా.. ఆ టీమ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో మంచి బ్యాటింగ్ పిచ్ పై ఆ టీమ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. జడేజా, హర్షిత్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
హర్షిత్ పేస్ దెబ్బ..
ఇంగ్లండ్ ను ఓ వైపు హర్షిత్ పేస్.. మరోవైపు జడేజా స్పిన్ దారుణంగా దెబ్బ తీశాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కు మంచి ఆరంభమే లభించింది. ఒకదశలో ఆ టీమ్ 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 రన్స్ చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ ఊపు మీద కనిపించారు. అయితే 8.5 దగ్గర తొలి వికెట్ పడటంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది.
మొదట ఫిల్ సాల్ట్ (43) రనౌటయ్యాడు. ఇక ఆ బెన్ డకెట్ (32), హ్యారీ బ్రూక్ (0)లను హర్షిత్ ఒకే ఓవర్లో వెనక్కి పంపించాడు. దీంతో ఇంగ్లండ్ 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్కడి నుంచి ఆ టీమ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే ఉంది. భారీ భాగస్వామ్యం ఒక్కటి కూడా నమోదు కాలేదు.
జడేజా స్పిన్ మ్యాజిక్
హర్షిత్ పేస్ కు జడేజా స్పిన్ కూడా తోడవడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. చివరికి 47.4 ఓవర్లలో 248 పరగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ టీమ్ లో కెప్టెన్ జోస్ బట్లర్ (52), జాకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. షమి, అక్షర్ పటేల్, కుల్దీప్ లకు తలా ఒక వికెట్ పడింది. ఒకరు రనౌటయ్యారు.
పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని చెప్పడంతో భారీ స్కోర్లు ఖాయమని అందరూ భావించారు. కానీ ఇంగ్లండ్ మాత్రం పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది. టీమిండియా బౌలర్ల ధాటికి వికెట్లు పారేసుకుంది. దీంతో భారీ స్కోరు సాధించలేకపోయింది.
సంబంధిత కథనం