Ind vs Eng 1st ODI Live: ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు.. తొలి వన్డేలో టార్గెట్ ఎంతంటే?
Ind vs Eng 1st ODI Live: టీమిండియాతో వన్డే సిరీస్ లోనూ ఇంగ్లండ్ బ్యాటింగ్ పతనం కొనసాగింది. నాగ్‌పూర్ లో జరుగుతున్న తొలి వన్డేలో హర్షిత్ రాణా, జడేజాల దెబ్బకి ఆ టీమ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

Ind vs Eng 1st ODI Live: ఇండియాలో టూర్లో ఇంగ్లండ్ బ్యాటర్ల తడబాటు కొనసాగుతూనే ఉంది. నాగ్‌పూర్ లో గురువారం (ఫిబ్రవరి 6) జరుగుతున్న తొలి వన్డేలోనూ మంచి ఆరంభం లభించినా.. ఆ టీమ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో మంచి బ్యాటింగ్ పిచ్ పై ఆ టీమ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. జడేజా, హర్షిత్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
హర్షిత్ పేస్ దెబ్బ..
ఇంగ్లండ్ ను ఓ వైపు హర్షిత్ పేస్.. మరోవైపు జడేజా స్పిన్ దారుణంగా దెబ్బ తీశాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కు మంచి ఆరంభమే లభించింది. ఒకదశలో ఆ టీమ్ 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 రన్స్ చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ ఊపు మీద కనిపించారు. అయితే 8.5 దగ్గర తొలి వికెట్ పడటంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది.
మొదట ఫిల్ సాల్ట్ (43) రనౌటయ్యాడు. ఇక ఆ బెన్ డకెట్ (32), హ్యారీ బ్రూక్ (0)లను హర్షిత్ ఒకే ఓవర్లో వెనక్కి పంపించాడు. దీంతో ఇంగ్లండ్ 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్కడి నుంచి ఆ టీమ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే ఉంది. భారీ భాగస్వామ్యం ఒక్కటి కూడా నమోదు కాలేదు.
జడేజా స్పిన్ మ్యాజిక్
హర్షిత్ పేస్ కు జడేజా స్పిన్ కూడా తోడవడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. చివరికి 47.4 ఓవర్లలో 248 పరగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ టీమ్ లో కెప్టెన్ జోస్ బట్లర్ (52), జాకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. షమి, అక్షర్ పటేల్, కుల్దీప్ లకు తలా ఒక వికెట్ పడింది. ఒకరు రనౌటయ్యారు.
పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని చెప్పడంతో భారీ స్కోర్లు ఖాయమని అందరూ భావించారు. కానీ ఇంగ్లండ్ మాత్రం పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది. టీమిండియా బౌలర్ల ధాటికి వికెట్లు పారేసుకుంది. దీంతో భారీ స్కోరు సాధించలేకపోయింది.